ఏపీలో జగన్ సర్కార్ సామాజిక పెన్షన్లను లబ్దిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామవాలంటీర్లు స్వయంగా అవ్వాతాలకు, దివ్యాంగులకు, వితంతువులకు స్వయంగా వారి ఇండ్ల దగ్గరకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆయన అనుకుల మీడియా ఏడు నెలల్లో ఏడు లక్షల పింఛన్లను ప్రభుత్వం తొలిగించిందంటూ దుష్ప్రచారం చేస్తోంది. పింఛన్లపై టీడీపీ అనుకుల మీడియా చేస్తున్న అసత్య ప్రచారంపై ఏపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎల్లో వైరస్.. చైనాలోని కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా పరిణమించిందని, ఎల్లో మీడియాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ మాత్రం కనిపించడం లేదని కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వంపై ఓ వైపు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంటే.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేవారని, కాని ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 54 లక్షల మందికి పింఛన్లు ఇస్తోందని మంత్రి తెలిపారు.
కొత్త సంవత్సరంలో సంక్రాంతితో పాటు రాష్ట్రంలో అమ్మ ఒడి, రైతు భరోసా అనే రెండు పండుగలు వచ్చాయన్నారు. అవేవీ ఎల్లో మీడియాకు కనబడటం లేదని దుయ్యబట్టారు. ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని, అమ్మ ఒడి పథకం కింద 82 లక్షల మంది విద్యార్థులకు సాయం చేశారని చెప్పారు. పింఛన్లు తీసుకునేందుకు వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి భావించారని.. అందుకే గ్రామ వలంటీర్ల ద్వారా వారి ఇళ్లకే పంపిస్తున్నారన్నారు. కేవలం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పసుపు–కుంకుమ కింద చంద్రబాబు డబ్బులు ఇస్తే డబ్బా మీడియా ఊదరగొట్టిందని.. జగన్ ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోపే కోటి మందికి పైగా ఆర్థిక సాయం చేస్తే అసలు ఈ ఎల్లో మీడియాకు పట్టడం లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను దించేసి రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని వనరులను దోచుకోవాలని చంద్రబాబు, ఎల్లో మీడియా చూస్తున్నాయని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఆంధ్రజ్యోతిలో ‘ఏడు నెలల్లో ఏడు లక్షల పింఛన్లు కట్’ అంటూ అసత్య కథనాలు ప్రచురించడం దుర్మార్గమన్నారు. ఎల్లో మీడియాకు బాస్ అయిన చంద్రబాబు నీచుడని ఎద్దేవా చేశారు. ‘వాస్తవానికి చంద్రబాబుది 420 బతుకు. ఆయన పుట్టిన నెల 4. తేదీ 20. పుట్టుకతోనే ఆయనను మించిన 420 మరొకరు లేరు’ అని మండిపడ్డారు. జేసీ దివాకర్‌రెడ్డికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదని, ఎవరు అధికారంలో ఉంటే వారికి 40 ఏళ్లుగా చిడతలు కొడుతూ తన అక్రమ వ్యాపారాలతో రాష్ట్రాన్ని లూటీ చేసిన వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబు బూట్లు నాకి సిమెంట్ ఫ్యాక్టరీకి 500 హెక్టార్లు తీసుకున్న వ్యక్తి జేసీ అని నాని పేర్కొన్నారు. యనమల రామకృష్ణుడి మెదడు చెడిపోయి చాలా కాలమైందని ఎద్దేవా చేశారు. మొత్తంగా చంద్రబాబు, ఆయన అనుకుల మీడియాపై మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారాయి.