తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి (78) మృతిచెందారు. దీర్ఘకాలికవ్యాధితో బాధపడుతున్న ఆయన యశో ద దవాఖానాలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం, కొర్రెముల గ్రామానికి చెందిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేందర్‌రెడ్డి మృతికి సీఎం కే చంద్రశేఖర్‌రావు సం తాపం వ్యక్తంచేశారు.
ఆయన అంత్యక్రియలను అధికారలాంఛనాలతో నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సోమవా రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సురేందర్‌రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.1981లో కొర్రెముల సర్పంచ్‌గా ఎన్నికైన సురేందర్‌రెడ్డి రాష్ట్రమంత్రిస్థాయికి ఎదిగారు.
తెలుగుదేశం పార్టీ లో ఆవిర్భావం నుంచి పనిచేశారు. 1985లో ఎన్టీరామారావు మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా.. భారీ మెజారిటీతో గెలుపొందారు. 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో అటవీ, పశుసంవర్ధకశాఖమంత్రిగా పనిచేశారు. 1989లోనే జరిగిన ఎన్నికల్లో మేడ్చల్ నుంచే పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2001లో తెలంగాణ సాధనలో భాగంగా కేసీఆర్ స్థాపించిన టీఆర్‌ఎస్‌లో వ్యవస్థాపక సభ్యుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.