ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిటాల రవి హత్య, ఆ తర్వాత టీడీపీ శ్రేణులు జరిపిన విధ్వంసకాండను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మద్దెలచెరువు సూరి కూడా హైదరాబాద్‌లో తన అనుచరుడు భానుప్రకాష్ చేతిలో హత్యకు గురయ్యాడు. ఇక పరిటాల రవిని తుపాకీతో కాల్చి చంపిన మొద్దు శ్రీను ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ..మా బావ సూరి కళ్లలో ఆనందం కోసం ఈ హత్య చేశానంటూ చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే మొద్దు శ్రీను జైల్లోనే సహనిందితుడి చేతిలో హత్యకు గురయ్యాడు. ఇక పరిటాల రవి హత్య విషయంలో నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి హస్తంపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారంలో ఉండడంతో పోలీసులు జేసీని కాపాడుతున్నారని…అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఈ కేసును విచారణ జరిపిన సీబీఐ మొత్తం 133 మంది సాక్షులను విచారించి..వారిలో 16 మందిని నిందితులుగా పేర్కొంది. అయితే అనంతపురం జిల్లా కోర్టు…మొత్తం పదహారు మందిలో ఎనిమిది మందిని దోషులుగా ప్రకటించింది…నలుగురిపై కేసు కొట్టివేసింది. ఈ కేసులో మరో ముగ్గురు ప్రధాన నిందితులు అయిన మద్దెలచెర్వు సూరి, మొద్దు శీను, తరగకుండ కొండారెడ్డిలు దారుణహత్యకు గురయ్యారు. ఇక ఏ టీడీపీ ఎమ్మెల్యే హత్యకేసుతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర విభజన నేపథ‌్యంలో కాంగ్రెస్‌ను వీడి అదే టీడీపీలో చేరారు.
కాగా ఇన్నేళ్ల తర్వాత పరిటాల రవి హత్యోదంతం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ కేసులో మరోసారి టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా పరిటాల రవీంద్ర హత్య కేసుకు సంబంధించి కందిగోపుల మురళి సంచలన విషయాలు బయటపెట్టారు. మీడియాతో మాట్లాడిన ఆయన పరిటాల రవీంద్ర హత్య కేసులో జేసీ దివాకర్ రెడ్డి పాత్ర ఉందని… హత్యకు ఉపయోగించిన తుపాకులను స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి సరఫరా చేశారని…హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో లభ్యమైన రివాల్వర్ కూడా జేసీ ఇచ్చిందే అని సంచలన ఆరోపణలు చేశారు. నేను జేసీ వద్ద చాలాకాలం పనిచేశానని కందిగోపుల మురళి చెప్పుకొచ్చారు. అలాగే పరిటాల రవి హత్యలో జేసీ పాత్రపై విచారించాలని గతంలో మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి కొండన్న పోలీసులకు ఫిర్యాదు చేశారని మురళీ గుర్తు చేశారు. కాగా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు జేసీకి లేదు. అనంతపురం జిల్లాలో ఆయన చేస్తున్న క్రిమినల్ రాజకీయాలపై బహిరంగ చర్చకు రావాలని కందిగోపుల మురళీ సవాల్ విసిరారు. మొత్తంగా పరిటాల రవి హత్యకేసులో జేసీ దివాకర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు అనంతపురం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. మరి అనంతపురం జిల్లా పోలీసులు మళ్లీ ఈ కేసును రీఓపెన్ చేసి….ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీ దివాకర్ రెడ్డిని విచారిస్తారో లేదో చూడాలి.