తెలంగాణ
రాష్ట్రంలో 2014 జూన్ నుంచి ఆసక్తికరమైన పరిస్థితి నెలకొందని… ప్రతి ఎన్నికల్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమౌతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నూతనంగా ఎన్నికైన పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్ పర్సన్లు, మేయర్లు తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2014లో 63 సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నాటుకున్నాయన్నారు. 2018లో చంద్రబాబు, రాహుల్ ఒక్కటైనా 75 శాతం సీట్లు టీఆర్ఎస్ సాధించిందన్నారు.
పంచాయతీ, జడ్పీ మండల ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 9 సీట్లు సాధించగానే ప్రతిపక్ష నాయకులు చంకలు గుద్దుకున్నారన్నారు. జడ్పీల్లో నూటికి నూరు శాతం సీట్లు సాధించడం దేశంలోనే ఓ చరిత్ర అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 130 సీట్లకు 122 సీట్లు సాధించడం ఇంకో చరిత్ర అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ఓటు కారుకే అనే అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతోందన్నారు.మున్సిపల్ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. ప్రతిపక్షాలు అడ్డుకోబట్టే ఎన్నికలు ఆలస్యమయ్యాయన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 8 వేల మంది నామినేషన్లు దాఖలు చేశారు. అదే కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే కరువయ్యారన్నారు. బీజేపీ ఎగిరెగిరి పడింది. ప్రత్యామ్నాయం తామేనని ఎగిసిపడింది. కానీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను దింపలేకపోయిందని ఎద్దేవచేశారు. టీఆర్ఎస్ విజయాన్ని అపహాస్యం చేస్తూ కొందరు నేతలు మాట్లాడుతున్నారని.. ఇది ఓట్లేసిన ప్రజలను అవమానపరచడమేనన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యవస్థల మీద నమ్మకం పోయిందంటున్నారు. ఉత్తమ్ రాజకీయాలను విరమించుకుని ఇంట్లో కూర్చుంటే మంచిదని హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈవీఎంలపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోమన్నారు. మున్సిపాలిటీలకు ఏడాదికి రూ.3 వేల కోట్లు వస్తాయని తెలిపిన మంత్రి ఇక పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు.