రాయలసీమవాసుల చిరకాల కోరిక హైకోర్టు ఏర్పాటు…. శ్రీబాగ్ ఒప్పందంలోనే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉంది..ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా హైదరాబాద్‌లో హైకోర్టు ఏర్పాటైంది. కానీ రాయలసీమ వాసులు దశాబ్దాలుగా హైకోర్టు కోసం పోరాడుతూనే ఉన్నారు. గత చంద్రబాబు హయాంలో కర్నూలులో కనీసం హైకోర్ట్ బెంచ్ అయినా ఏర్పాటు చేయాలని సీమప్రజలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే చంద్రబాబు మాత్రం హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయకుండా అమరావతిలోనే సర్వం కేంద్రీకృతం చేశాడు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీమ ప్రజల ఆకాంక్షల మేరకు కర్నూలులో జ్యుడిషీయల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెడితే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పీకర్‌ను ప్రభావితం చేసి…బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేలా చేశారు. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడంలో యనమల కీలక పాత్ర పోషించారు.. అంతే కాదు వైజాగ్‌లో రాజధాని పెట్టమని ఎవరు అడిగారు అని యనమల ప్రభుత్వం అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. ఇక రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై ఎవరికీ అభ్యంతరాలు లేవంటూనే… అక్కడి ప్రజలు హైకోర్టును కోరుకోవడం లేదన్నట్లుగా యనమల మాట్లాడుతున్నారు. కాగా యనమల వ్యాఖ్యలపై సీమవాసులు భగ్గుమంటున్నారు.
తాజాగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై యనమల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. సీమ ప్రజల ఆకాంక్షలు కనిపించడం లేదా..ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావని యనమలను ప్రశ్నించారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో హైకోర్టు పెట్టాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయని హఫీజ్ ఖాన్ అన్నారు. హైకోర్టు బెంచ్ రాయలసీమలో పెడతామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఫైర్ అయ్యారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ఆకాంక్ష మేరకు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నారని హఫీజ్ ఖాన్ తెలిపారు. రాయలసీమలో హైకోర్టు పెట్టడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం అనేది తమ ప్రాంత ప్రజల హక్కు అని పేర్కొన్నారు. ఇక 29 గ్రామాలకు నాయకుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు రాబోయే రోజుల్లో టీడీపీని బంగాళా ఖాతంలో కలుపుతారని హఫీజ్ ఖాన్ ఎద్దేవా చేశారు. మొత్తంగా సీమ ప్రజలు హైకోర్టు కోరుకోవడం లేదంటూ యనమల చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.