ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్రలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు మండిపడుతున్నారు. సీమలో పుట్టి పెరిగిన చంద్రబాబుకు ఎప్పుడూ అత్తగారిల్లు అయినా కృష్ణా, గుంటూరు జిల్లాలపైనే మక్కువ. గతంలో పలుమార్లు రౌడీలు, హంతకులంటూ సీమ ప్రజలపై నోరుపారేసుకున్నాడు. ముఖ్యంగా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే ఏం వస్తుంది..ఓ రెండు జీరాక్స్ సెంటర్లు, నాలుగు టీ కొట్లు తప్పా…అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అమరావతి ఆందోళనకారులు కూడా కర్నూలు, వైజాగ్‌లలో రాజధాని ఏర్పాటుపై సీమ ప్రజల మనోభావాలను కించపరుస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అనుకుల మీడియా ఛానళ్లు, పత్రికలు కూడా వైజాగ్‌లో రాజధాని ఏర్పాటు చేస్తే సీమనుంచి లుంగీలు కట్టుకుని వచ్చి భూకబ్జాలు చేస్తారు, ఫ్యాక్షనిజం, రౌడీయిజం పెరిగిపోతుందంటూ.. అంటూ సీమ ప్రజలను కబ్జాకోరులుగా, ముఠాదారులుగా, రౌడీలుగా చిత్రీకరిస్తూ..వారి మనోభావాలను కించపరుస్తున్నారు.
పగోడు వచ్చినా… కడుపు నిండా అన్నంపెట్టి పంపించే అద్భుతమైన సీమ సంస్కృతిని అవహేళన చేస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలపై రాయలసీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సీమ ప్రజలు దశాబ్దాలుగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో కూడా కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని సీమ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అయినా బాబు పట్టించుకోలేదు..ఎట్టకేలకు సీమ బిడ్డగా సీఎం జగన్ ఇన్నేళ్లకు కర్నూలును జ్యుడిషియరీ క్యాపిటల్‌గా చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడు. అందుకే మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో కుట్రపూరితంగా అడ్డుకున్నాడు. బాబు కుట్రలపై రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఎక్కడక్కడ టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు.
తాజాగా సొంత నియోజకవర్గంలో చంద్రబాబు బావమరిది, సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ కాన్వాయ్‌ను ప్రజాసంఘాల నేతలు గురువారం అడ్డుకున్నారు. అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ వారు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్దిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే బాలయ్య గో బ్యాక్…. రాయలసీమ ప్రజల మనోభావాలను లెక్కచేయని బాలయ్య గో బ్యాక్.. సీమ ద్రోహి బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో ఖంగు తిన్న బాలయ్య ఏం మాట్లాడలేక తన కాన్వాయ్‌లోనే కూర్చుండిపోయారు. మొత్తంగా వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు, టీడీపీ నేతలపై సీమప్రజలకు ఎంత ఆగ్రహం ఉందో బాలయ్యకు తెలిసివచ్చింది.