రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మూడు రాజధానుల విషయంలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ప్రజలు, సామాన్యులు, జర్నలిస్టులతో పాటు మేధావులు సైతం మద్దతు తెలుపుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటుగా జయప్రకాష్ నారాయణ కూడా మూడు రాష్ట్రాలకు తన మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు మద్దతిచ్చారు.. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉండాలని తమ నివేదికలో స్పష్టంగా చెప్పామని, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిపై తమ కమిటీ ఇచ్చిన నివేదికపై కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన తప్పుడు వార్తలపై జీఎన్ రావు స్పందించారు.
పలు ప్రాంతాల్లో పర్యటించి 13జిల్లాల అభివృద్ధికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. కొందరు జీఎన్ రావు రిపోర్టును తగలబెట్టడం బాధకరమని అన్నారు. తమ నివేదికపై తప్పుడు వార్తలను ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా పెట్టొద్దని తాము చెప్పలేదన్నారు. తమ కమిటీ సభ్యులను ప్రభావితం చేశారనేది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని అన్నారు. కమిటీలో 40 ఏళ్ల అనుభవం కలిగినవారు ఉన్నారని జీఎన్ రావు గుర్తుచేశారు. ప్రలోభాలకు లొంగే సాదాసీదా వ్యక్తులు కమిటీలో లేరని స్పష్టం చేశారు.
కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా వారి వారి రంగాల్లో ఎంతో అనుభవం కలవారని చెప్పారు. మూడు, నాలుగు నెలలు కష్టపడి తాము నివేదికను తయారుచేస్తే.. దానిని తగలబెట్టడం సరికాదన్నారు. విశాఖపట్నంతోపాటు విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు సంబంధిచిన లాభనష్టాలను చర్చించామని వెల్లడించారు. విశాఖలో ఎటువైపు రాజధాని పెట్టుకోవచ్చో రిపోర్టులో స్పష్టంగా చెప్పామని అన్నారు. హైకోర్టుతో ట్రిబ్యునల్స్ కూడా ఏర్పడతాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే సూచనలు ఇచ్చినట్టు పేర్కొన్నారు.