ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అధినేత చంద్రబాబు… స్పీకర్ షరీఫ్‌ను అడ్డం పెట్టుకుని కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవరోధాలు ఏర్పడ్డాయి. అయితే ఏకంగా శాసనమండలిని రద్దు చేసి మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదిలేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. కాగా మూడు రాజధానుల ఏర్పాటుపై టీడీపీ నేతలు, అమరావతి ఆందోళనకారులు హైకోర్టులో కేసులు వేశారు. వీటిపై విచారణ జరుగుతోంది. అయినా జగన్ సర్కార్ విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు ముందడుగు వేస్తోంది. మార్చి 25 ఉగాది నాడు అంటే తెలుగు సంవత్సరాది నాడు విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు సీఎం జగన్ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈలోగా ముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధం చేయాలని విశాఖపట్నం జిల్లా అధికారులకు సీఎంవో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఉగాది రోజున సీఎం జగన్ విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో సీఎం కార్యాలయంగా మిలీనియం టవర్స్ పని చేస్తుందని తెలుస్తోంది. దీనినే రాష్ట్ర సచివాలయంగా అధికారులు అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నారు. ఇక అమరావతి నుంచి సెక్రటేరియట్ తరలింపుకు కొంత ఆలస్యం జరిగినా…సీఎం కార్యాలయం మాత్రం వైజాగ్‌కు షిఫ్ట్ అవడం ఖాయమని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే మార్చి 25 వ తేదీన..విశాఖ కేంద్రంగా పాలన మొదలవుతుందన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. మరోవైపు శాసనమండలి రద్దును అడ్డుకున్నామని మురిసిపోతున్న చంద్రబాబు, టీడీపీ నేతలు సీఎం జగన్ అనూహ్యంగా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు ముందడగు వేయడంతో షాక్ అవుతున్నారు. మొత్తంగా ఎన్ని అవరోధాలు ఎదురైనా మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ వెనక్కి తగ్గకుండా ముహూర్తం ఖరారు చేయడంపై ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.