జనసేన పార్టీకి ఆ పార్టీ కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను డైరెక్ట్‌గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పంపారు. వైయస్ జగన్ అక్రమాస్థుల కేసుల్లో ఈ మాజీ సీబీఐ అధికారి వ్యవహరించిన తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శల వెల్లువెత్తాయి. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీనారాయణ…తొలుత సొంతంగా పార్టీ పెడుతున్నట్లు.. బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ లక్ష్మీనారాయణ అనూహ్యంగా జనసేన పార్టీలో చేరారు. అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు మొదట్లో అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే వైసీపీ అభ్యర్థికి గట్టిపోటీ ఇచ్చారు. సొంత ఇమేజ్‌తో రెండు లక్షలకుపైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఎన్నికల తర్వాత పవన్, జేడీల మధ్య విబేధాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. గత కొంతకాలంగా పవన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్న లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం అధ్యక్షుడు పవన్‌ను కలవడానికి కూడా ఇష్టపడలేదు..
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడంపై నిరసనగా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖలో పవన్ సినిమాల్లో తిరిగి నటించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది. కావున, నేను పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంట నడిచిన ప్రతి కార్యకర్తకి, నాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, వారందరికి మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని లక్ష్మీనారాయణ తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఇటీవల బీజేపీతో జనసేన పొత్తు సహా పలు కీలక అంశాలపై పార్టీ కానీ, పవన్ కానీ తనను సంప్రదించకపోవడంపై లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయిన లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మరి మున్ముందు ఆయన ఏ పార్టీలో చేరుతాడో చూడాలి.