వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు ఎమ్మెల్సీ నారా లోకేష్, మరో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కీలక పాత్ర పోషించారు. స్పీకర్ షరీఫ్‌ను ప్రభావితం చేసి, నిబంధనలకు వ్యతిరేంగా మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడంలో టీడీపీ విజయవంతమైంది. అయితే ప్రభుత్వం ఏకంగా శాసనమండలిని రద్దు చేసి తండ్రీ కొడుకులను షాక్ ఇచ్చింది. శాసనమండలి రద్దుపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌లపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల కంటే రాయలసీమలో కీయా వంటి 30 పరిశ్రమలు వస్తే చాలు అంటున్న.. బాబు, లోకేష్‌లు ఐదేళ్లపాటు గాడిదలు కాశారా.. అని వెల్లంపల్లి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబు తన పాలనలో రాయలసీమకు 30 పరిశ్రమలు ఎందుకు తేలేకపోయారని మంత్రి సూటిగా ప్రశ్నించారు.
గత ఐదు ఏళ్లలో అభివృద్ధి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు, లోకేష్ దోపిడికి మాత్రమే పరిమితమయ్యారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు వంటివారు ఎందరు అడ్డువచ్చినా సీఎం జగన్ చేసే అభివృద్ధిని అడ్డుకోలేరని వెల్లంపల్లి అన్నారు. లోకేష్ నాయుడు మంగళగిరిలో ఓడిపోయాడు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు కుప్పంలో సైతం ఓడిపోతారని వెల్లంపల్లి జోస్యం చెప్పారు. ప్రజా వ్యతిరేకతతో అసెంబ్లీలో సైతం అడుగు పెట్టలేని స్థితికి చంద్రబాబు చేరతారని ఆయన ఎద్దేవా చేశారు. ఇక జనసేన బీజేపీ పొత్తుపై కూడా మంత్రి వెల్లంపల్లి స్పందించారు. చంద్రబాబు మాట పవన్ కల్యాణ్ నోట.. అదే మాట కన్నా లక్ష్మినారాయణ నోట అన్న చందంగా పరిస్థితులు మారాయని విమర్శించారు. బాబు, పవన, కన్నాలు రాష్ట్ర ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని వెల్లంపల్లి మండిపడ్డారు. ప్యాకేజీని పాచిపోయిన లడ్డులు అని.. మోదీని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వం అని డైలాగులు కొట్టిన పవన్ కల్యాణ్ చివరకు అదే మోదీ చెంత చేరారని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో కన్నా లక్ష్మినారాయణ, పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. మొత్తంగా శాసనమండలి రద్దు నేపథ‌్యంలో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.