చైనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచంలోని 10 దేశాలకు పాకింది. చైనా దేశంలో ప్రబలిన కరోనావైరస్ 2,744 మందికి సోకగా, వీరిలో 80 మంది మరణించారు. చైనాలో కరోనావైరస్ రోగుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్క ఆదివారం రోజే చైనాలో కొత్తగా 769 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని చైనా అధికారులు చెప్పారు. వుహాన్ నగరంలో ప్రబలిన కరోనావైరస్ ప్రపంచంలోని థాయ్‌లాండ్, జపాన్, కొరియా, అమెరికా, వియత్నాం, సింగపూర్, మలేషియా, నేపాల్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ వ్యాప్తి చెందాయి. థాయ్‌లాండ్ దేశంలో 7, జపాన్ లో 3, కొరియాలో 3, అమెరికాలో 3, వియత్నాంలో 2, సింగపూర్ లో 4, మలేషియాలో 3, నేపాల్ లో 1, ఫ్రాన్స్ లో 3, ఆస్ట్రేలియాలో 4 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. చైనాలోని 12 నగరాల్లో ఈ వైరస్ సోకడం వల్ల 56 మిలియన్ల మంది ప్రజలు వారి నగరాల నుంచి రాకపోకలు సాగించకుండా నిషేధం విధించారు. ఈ వైరస్ వ్యాపించకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
