ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా అనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ మండలిని రద్దు చేయాలని భావిస్తే ఆమోద ముద్ర కూడా వేస్తారు. అనంతరం 11 గంటలకు శాసనసభలో ఆమోద ముద్రను పెట్టి తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపటంతో ఆగ్రహం చెందిన సర్కార్ మండలిని రద్దు చేసేందుకే మొగ్గుచూపుతోంది. అలాగే మండలిలో మెజారిటీ లేకపోవటంతో శాసనసభలో ఆమోదించిన బిల్లులు మండలిలో ఆమోదం పొందలేకపోతున్నాయి.
దీంతో బిల్లులు తిప్పి పంపడం, జాప్యం చేయడంతో భారీ మెజార్టీతో గెలిచిన ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. దీంతో మండలిం రద్దుచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో పాటు పార్టీలోని ముఖ్యనేతలు, న్యాయ నిపుణులతో చర్చించిన జగన్ మండలిపై వేటు వేయాలని దాదాపు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు మండలి రద్దు చేస్తామని అధికారికంగా చెప్పకపోయినా రద్దుకే సీఎం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పరంగా మంచి జరుగుతున్నా పార్టీ పరంగా నష్టం జరుగుతుందని పలువురు స్పష్టం చేసినా అన్నీ సర్దుకుంటాయని, మండలి రద్దుకే నిశ్చయించినట్లు తెలుస్తోంది.మరి కాసేపట్లో ఏపీ మంత్రివర్గ సమావేశమై శాసనమండలిని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుని, శాసనసభలో తీర్మానం చేసి తీర్మానం ఆమోదం పొందిన వెంటనే కేంద్రానికి పంపే యోచనలో ప్రభుత్వం ఉన్నదని స్పష్టమవుతోంది.