పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతికి కృషి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు జేజేలు తెలిపారు కేటీఆర్. 127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో అగ్రభాగాన నిలిచింది టీఆర్‌ఎస్ పార్టీ అని ఆయన తెలిపారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యావంతులకు, మేధావులకు, ప్రజలకు వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలంగా విశ్వసించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయి. పేరుకు ఢిల్లీ పార్టీలు చేసేవన్ని పనికిమాలిన పనులు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. మేడ్చల్, నేరేడుచర్లలోనూ టీఆర్‌ఎస్సే గెలుస్తుందన్నారు. 10 కార్పొరేషన్లలోనూ తామే గెలుస్తున్నాం. కాంగ్రెస్‌కు 4, బీజేపీ 2, ఎంఐఎంకు 2 మున్సిపాలిటీలు మాత్రమే వచ్చాయి.
తెలంగాణలో పట్టణీకరణ చాలా వేగంగా జరుగుతుంది. 43 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తాం. ఇంత పెద్ద మెజార్టీని ఇచ్చినందుకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతాం అని కేటీఆర్ తేల్చిచెప్పారు. *మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం* రాష్ట్రం ఏర్పడక ముందు 68 మున్సిపాలిటీలు ఉండేవి. ఈ రోజు మున్సిపాలిటీల సంఖ్య 141కి చేరింది. తెలంగాణ రాష్ట్రం రాక ముందు 6 కార్పొరేషన్లు ఉంటే.. ఇప్పుడు 13 కార్పొరేషన్లు ఉన్నాయి. జనాభా ప్రతిపాదికన శాస్త్రీయంగా ముందుకు వెళ్తున్నాం. పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతి ఉండాలనే ఉద్దేశంతో కొత్త మున్సిపల్ చట్టం తీసుకువచ్చాం.
త్వరలోనే ప్రతి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు చేస్తాం. కొత్తగా ఎంపికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లకు మున్సిపల్ చట్టంపై శిక్షణ ఇస్తాం. అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మున్సిపాలిటీలకు రూ.2,074 కోట్లు రానున్నాయి. నిధులు సమకూర్చి మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం. కొత్త మున్సిపల్ చట్టం పౌరుడి కేంద్రంగా రూపొందించాం. అవినీతికి ఆస్కారం లేకుండా భవన నిర్మాణ అనుమతులు ఇస్తాం. ప్రతి డివిజన్ లేదా వార్డులో నాలుగు కమిటీలు వేయబోతున్నాం. ఒకటి యూత్ కమిటీ, రెండోది వుమెన్ కమిటీ, మూడోది సీనియర్ సిటిజన్ కమిటీ, నాలుగోది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తాం. మున్సిపాలిటీల్లో జవాబుదారితనం తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
స్వయం ధ్రువీకరణ విధానంలో ఇళ్ల నిర్మాణానికి 21 రోజుల్లో అనుమతులు ఇస్తాం. అన్ని మున్సిపాలిటీల్లో డిజిటల్ డోర్ నంబర్ల విధానం తీసుకువస్తాం. వ్యాపార, వాణిజ్య సముదాయాలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఇస్తాం. మున్సిపాలిటీల్లో అన్ని సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లోనే ఇస్తాం. అక్రమ లేఔట్లు, అక్రమ నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. నోటీసులు ఇవ్వకుండానే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం. అక్రమ నిర్మాణాలకు సహకరించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.