వాయిస్ ఓవర్ : నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి పెద్ద సంచలనం చోటు చేసుకుంది..ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రతిపాదించారు. సభలో చర్చ జరిపిన అనంతరం కౌన్సిల్ రద్దు తీర్మానాన్ని ఆమోదించి..కేంద్రానికి పంపనున్నారు. అయితే శాసనమండలి రద్దు తీర్మానం ఈ సాయంత్రానికి ఆమోదం పొందిన మరుక్షణం ఇద్దరు కేబినెట్ మంత్రులు రాజీనామా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిలో ఒకరు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాగా…మరొకరు మోపిదేవి వెంకటరమణ…ఈ ఇద్దరుమంత్రులు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. శాసన మండలి రద్దు అనంతరం వీరు పదవులు కోల్పోనున్నారు. కాగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు శాసనమండలి రద్దుపై సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో వీరిద్దరి రాజీనామాలపై చర్చ జరిగింది. సభలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం కాగానే ఈ సాయంత్రమే తమ పదవులకు రాజీనామా చేయడానికి పిల్లిసుభాష్, మోపిదేవి సిద్ధమైనట్లు సమాచారం. అయితే శాసనమండలి రద్దును కేంద్రం ఆమోదించేవరకు పదవులకు వచ్చిన ఇబ్బందేలేదు..అప్పటివరకు మంత్రులుగా కొనసాగించవచ్చు అని ఇతర మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కాని ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో తాము ఇక మంత్రులుగా కొనసాగటం సరైనది కాదని…తాము తమ పదవులకు రాజీనామా చేస్తామని పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు స్పష్టం చేశారంట..దీంతో ఈ సాయంత్రం వీరివురు మంత్రిపదవులకు రాజీనామా చేయడం దాదాపుగా ఖాయమైంది.
పిల్లిసుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు వైయస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు..వైయస్ మరణం తర్వాత రోశయ్య కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన పిల్లి సుభాష్ నాడు జగన్ కోసం తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.ఇక మోపిదేవి వాన్‌పిక్ కేసులో జైలు జీవితం అనుభవించారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పిల్లి సుభాష్ మండపేట నుంచి, మోపిదేవి రేపల్లె నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినా సీఎం జగన్‌కు వారిమీద ఉన్న అభిమానంతో మంత్రి పదవులు కట్టబెట్టి తర్వాత ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం శాసనమండలి రద్దు నేపథ‌్యంలో జగన్ వారిద్దరి రాజకీయ భవిష్యత్తుపై భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్‌లో బీసీ వర్గానికి చెందిన పిల్లిసుభాష్ కు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఇక మోపిదేవికి త్వరలో ఏర్పాటు చేయబోయే ప్రాంతీయ మండలి ఛైర్మన్ పదవి ఇస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి పిల్లి సుభాస్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు తమ మంత్రిపదవులకు రాజీనామా చేయడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.