: ఏపీలో జనసేన – బీజేపీల పొత్తు తర్వాత ప్రకటించిన తొలి ఉమ్మడి కార్యక్రమానికి ఆదిలోనే హంసాపాదు ఎదురైంది. రాజధాని రైతుల ఆందోళనలకు మద్దతుగా ఫిబ్రవరి 2 న జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో అమరావతి పరిరక్షణ పేరుతో లక్షమందితో తాడేపల్లి నుంచి విజయవాడ వరకు భారీ కవాతు జరిపి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు సంయుక్తంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ ఉమ్మడి లాంగ్ మార్చ్‌ను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది.
కాగా పొత్తు తర్వాత ఢిల్లీ వేదికగా ప్రకటించిన తొలి ఉమ్మడి కార్యక్రమమే వాయిదా వేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ లాంగ్ మార్చ్ వాయిదా పడడానికి ప్రధాన కారణం..వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లడం అని తెలుస్తోంది. ఒకవైపు శాసనమండలి రద్దు విషయంలో జరుగుతున్న పరిణామాలు…మరోవైపు, శాసనసభలో ఆమోదించిన బిల్లులపైన రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించగా ..ఆ కేసులు వచ్చే నెల 26వ తేదీకి వాయిదా పడడం..ఇత్యాది కారణాలతో కవాతును వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే పవన్ కల్యాణ్ దిల్ రాజు నిర్మిస్తున్న పింక్ రీమేక్ సినిమాకు డేట్లు ఇచ్చారు. ఒక రోజు షూటింగ్ అయిన తర్వాత పవన్ వరుసగా ఢిల్లీ టూర్‌కు వెళుతుండడంతో షెడ్యూల్ అంతా అప్‌సెట్ అయిపోయింది. దీంతో చిత్ర నిర్మాతలు తలపట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ సిన్మాకు ఇచ్చిన డేట్లు అడ్జెస్ట్‌మెంట్‌లో భాగంగా కవాతును రద్దు చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. శాసనమండలి రద్దు, వికేంద్రీకరణ బిల్లుపై జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కవాతు వాయిదా పడిందని..జనసేన బీజేపీ పార్టీలు అంటున్నాయి. మొత్తంగా జనసేన – బీజేపీల పొత్తు తర్వాత ప్రకటించిన తొలి ఉమ్మడి కార్యక్రమం వాయిదా పడడంతో రెండు పార్టీల శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది.