ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మెజారిటీ రైతులు ఉన్న మందడం, వెలగపూడి, పెనుమాక వంటి ఐదారు గ్రామాల్లోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే అధికార వైసీపీ మాత్రం…అమరావతిలో ఆందోళనలు చేస్తున్నది..పేద రైతులు కాదని…రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించిన బాబు సామాజికవర్గానికి చెందిన వారు అని…విమర్శలు చేస్తోంది.
తాజాగా ప్రభుత్వం మూడు రాజధానులపై అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. కాగా కౌన్సిల్‌లో మెజారిటీ ఉన్న టీడీపీ వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ సహాయంతో సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీంతో ప్రభుత్వం ఏకంగా శాసనమండలిని రద్దు చేసి వికేంద్రీకరణపై ముందడుగు వేసేందుకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై అమరావతి రైతులు పెద్ద ఎత్తున న్యాయస్థానాల్లో కేసులు వేశారు. దీంతో ఈ కేసుల్లో తమ తరపున వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించిన జగన్ సర్కార్ ఆయనకు రూ. 5 కోట్ల ఫీజు చెల్లిస్తోంది. ఇలా ప్రభుత్వం లాయర్ ఫీజు కింద రూ. 5 కోట్లు చెల్లించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకే జగన్ సర్కార్ ముందుకు సాగుతుందని..అందుకే ఏకంగా రూ. 5 కోట్లు తగలేసి లాయర్‌ను మాట్లాడేసిందని తీవ్ర విమర్శలు చేశారు. తమకు కోర్టుల్లో ఎదురు దెబ్బ తగలకుండా..ప్రభుత్వం ఇలా కోట్లాది రూపాయలు తగలేస్తూ…పేద రైతుల పొట్టకొడుతుందని చంద్రబాబు ఆరోపించారు.
అయితే తాజాగా చంద్రబాబు చెబుతున్న అమరావతి పేద రైతులు తమ తరపున కోర్టుల్లో కేసుల్లో వాదించేందుకు తమ లాయర్‌కు చెల్లించిన మొత్తం ఎంతో తెలిస్తే మీకు బైర్లు కమ్మడం ఖాయం…అమరావతి పేద రైతులు తమ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్‌కు మూడు రోజులకుగాను ఒక కోటి 15 లక్షల రూపాయలు చెల్లించారనే వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు చెబుతున్నట్లు నిజంగా అమరావతి రైతులు పేదవారైతే మూడు రోజులకే కోటికిపైగా డబ్బులు చెల్లించగలుగుతారా..అన్న సందేహాలు కలుగుతున్నాయి. ..ఒకవేళ అమరావతి పేద రైతులు చెల్లించకపోతే..వారి తరపున చంద్రబాబు చెల్లించాడా ..అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో తెల్లకార్డులు ఉన్న 797 మంది పేద రైతులు…280 కోట్ల విలువ చేసే భూములను కొనుగోలు చేశారని సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ తెల్లకార్డుదారుల భూ కొనుగోళ్లపై ఐటీ, ఈడీ విచారణ జరపనుంది. ఇప్పుడు అమరావతి రైతులు మూడురోజులకే లాయర్ ఫీజు కోటి 15 లక్షలు చెల్లించడం సంచలనంగా మారింది. ఈ విషయంపై కూడా సీఐడీ ఆరా తీస్తోంది. లాయర్ ఫీజు చెల్లించిన వారి గురించి కూపీ లాగుతోంది. మొత్తంగా మూడు రోజులకే తమ తరపున వాదించిన లాయర్‌కు కోటి 15 లక్షలు చెల్లించిన అమరావతి పేద రైతుల ఉదంతం ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.