ముంబైలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘దిల్ తో హ్యాపీ హై జీ’లో సెజల్ శర్మ సిమ్మీ ఖోస్లా పాత్రను ధరించి మంచి గుర్తింపు పొందారు. ముంబైలోని మీరా రోడ్‌లో రాయల్ నెస్ట్ సొసైటీలో ఉన్న తన స్నేహితురాలి నివాసంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలు రూం తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని రూం తలుపు బద్దలు కొట్టి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సెజల్ మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.
కాగా సెజల్ ఆత్మహత్య చేసుకున్న స్థలంలో సూసైడ్ నోట్ దొరికిందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తన ఆత్యహత్యకు ఎవరు కారణం కాదని, వ్యక్తిగత కారణాలతోనే సూసైడ్‌కు పాల్పడినట్లు నోట్‌లో పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన సెజల్ శర్మ.. నటి కావాలని బలమైన కోరికతో 2017లో ముంబైకి వచ్చారు. స్టార్ ప్లస్ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘దిల్ తో హ్యాపీ హై జీ’అనే టీవీ షోలో ఆమె తొలిసారి నటించారు. సెజల్ శర్మ సహ నటుడు అరు కే వర్మ మాట్లాడుతూ.. సెజల్ ఆత్మహత్య వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. పది రోజుల క్రితమే తాను ఆమెను కలిశానని, గత ఆదివారం వాట్సాప్ చాట్ చేసినట్లు చెప్పారు. పది రోజుల క్రితం ఆమెను కలిసినప్పుడు ఆమె అప్పుడు బాగానే ఉందని తెలిపారు. ఇంతలోనే ఈ వార్త వినడం బాధాకరమని అన్నారు. సెజల్ శర్మ మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులు ఉదయ్ పూర్ తీసుకెళ్తున్నారని, అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు.