ఏపీ శాసనమండలిలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ బిల్లులను టీడీపీ తమ పార్టీకే చెందిన స్పీకర్ షరీఫ్‌ను అడ్డంపెట్టుకుని సెలెక్ట్ కమిటీకి పంపించడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడానికి కుట్ర చేసిన చంద్రబాబు, లోకేష్, యనమల టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఈ విషయంపై స్పందిస్తూ చంద్రబాబు, యనమలపై విరుచుకుపడ్డారు. శానసమండలిలో పరిణామాలను మేధావులు, ప్రజలు బ్లాక్ డే గా భావిస్తున్నారన్న ఆయన మండలి ఛైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికమని విమర్శించారు. తాను తప్పు చేస్తున్నట్లు స్వయంగా ఛైర్మనే ఒప్పుకున్నారని, ఆయన తీరును మేధావులు కూడా తప్పుబట్టారని అన్నారు. బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా నిబంధనల ప్రకారం వెళ్లాలని ఛైర్మన్‌కు సూచించారు.
అయితే చంద్రబాబు మాత్రం మండలి గ్యాలరీలో కూర్చుని ఛైర‍్మన్‌ను కనుసైగలతో శాసించారని మండిపడ్డారు. .ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా మండలి ఛైర్మన్ వ్యవహరించారని… ఆయన నిర్ణయం వల్ల కొంత ఆలస్యం మాత్రమే జరుగుతుందని అమర్‌నాథ్ అన్నారు. అసలు ఏం సాధించారని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసినందుకా ఈ ఆనందోత్సాహాలు? ప్రజాస్వామ్యవాదులంతా ఈ అంశంపై ఆలోచించాలని అమర్‌నాథ్ కోరారు.ఇక చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో.. 13 జిల్లాలకు విలన్. ఆయన పనికిరాని వారిని శాసనమండలికి తీసుకు వచ్చారు. కొబ్బరి చిప్పలు అమ్ముకునే బుద్ధా వెంకన్నను మండలిలో కూర్చోబెట్టారు. తాను మేధావినంటూ వరుసగా ఓడిపోయిన యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్సీని చేశారు. స్పీకర్‌గా యనమల చేసిన కుట్రలు పైనున్న ఎన్టీఆర్‌కు తెలుసు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కు సభలో మైక్ ఇవ్వని మీరా రూల్స్ గురించి మాట్లాడేది? చంద్రబాబు చేస్తున్న పోరాటాలు తాత‍్కాలికమే. ఆయన కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు తాత దిగొచ్చినా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోలేరని అమర్‌నాథ‌్ తేల్చి చెప్పారు. మొత్తంగా శాసనమండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు, యనమల, లోకేష్‌లను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.