ఏపీ శాసనమండలిలొ జరిగిన పరిణామాలపై జగన్ సర్కార్ ఆగ్రహంతో ఉంది. ఏకంగా శాసనమండలినే రద్దు చేసే దిశగా ఆలోచన చేస్తుంది. కాగా శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ విప్‌ను సైతం ధిక్కరించి మూడు రాజధానుల బిల్లుపై ప్రభుత్వానికి మద్దతుగా ఓటేసింది. ఆమెతో పాటు మరో ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, శమంతకమణి సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసారు. దీంతో చంద్రబాబు ఖంగుతిన్నాడు. ముఖ్యంగా పార్టీ విప్‌ను ధిక్కరించిన పోతుల సునీతపై బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడని సమాచారం. ఈ నేపథ్యంలో పోతుల సునీత సీఎం జగన్‌ను కలవడం టీడీపీలో కలకలం రేపుతొంది.
తాజాగా జనవరి 23 వ తేదీ సాయంత్రం పోతుల సునీత, తన భర్త సురేష్‌తో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. కాగా పోతుల సునీత ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు కీలకపాత్ర పోషించారు. సీఎం జగన్‌కు పోతుల దంపతులను వీరిరువురు పరిచయం చేశారు. పోతుల దంపతుల గురించి మంత్రి బాలినేని సీఎంకు వివరించినట్లు తెలిసింది. వైవీ కూడా సునీత దంపతుల పట్ల సానుకూలంగా మాట్లాడారని తెలుస్తోంది. అనంతరం జగన్ అంతా మంచే జరుగుతుంది, జాగ్రత్తగా పనిచేసుకోండి అని పోతుల దంపతులకు సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సునీత దంపతులు పేద ప్రజానీకం అధికంగా ఉన్న చీరాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరినట్లు తెలిసింది. అయితే పోతుల దంపతుల రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పటికప్పుడు సీఎం జగన్ ప్రత్యేకంగా హామీ ఇవ్వలేదని సమాచారం. మొత్తంగా శాసనమండలిలో విజయం సాధించామని సంబరాలు జరుపుకుంటున్న చంద్రబాబుకు పోతుల దంపతులు ఎగిరిపోవడంతో గట్టి షాకే తగిలింది. ఉన్న ఎమ్మెల్సీలంతా ఒక్కొక్కరుగా…పార్టీకి గుడ్‌బై చెబుతుండడంతో టీడీపీలో ఆందోళన మొదలైంది.