వైసీపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని తరచుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ టార్గెట్‌గా పదునైన విమర్శలతో చెలరేగిపోతున్నారు. కాగా శాసనమండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును, సీఆర్‌డీఏ రద్దు బిల్లును స్పీకర్ షరీఫ్ విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపారు. బిల్లులపై చర్చ సందర్భంగా చంద్రబాబు ఎన్నడూ లేనిది మండలికి వచ్చి 5 గంటల పాటు గ్యాలరీలో కూర్చుని స్పీకర్‌ను ప్రభావితం చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.
తాజాగా ఈ వివాదంపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ…చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. తమ నాయకుడు జగన్ దెబ్బకు శాసనమండలి గ్యాలరీ ఎక్కారని నాని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ కొనసాగుతున్నప్పటికీ.. డుమ్మా కొట్టి మరీ.. నాలుగు గంటల పాటు శాసన మండలి గ్యాలరీలో కూర్చున్నారని అన్నారు. అత్యవసరమైతే తప్ప ఏనాడూ శాసన మండలి ముఖం కూడా చూడని చంద్రబాబును అక్కడ నాలుగు గంటల పాటు కూర్చోబెట్టిన ఘనత జగన్‌కు దక్కిందని వెటకారం ఆడారు. సీఎం జగన్ లాంటి దమ్మున్న నాయకుడు ఉండబట్టే చంద్రబాబు లాంటి చెత్త వ్యక్తులు రాజకీయ నిరుద్యోగులు అయ్యారని కొడాలి నాని పేర్కొన్నారు.
అలాగే చంద్రబాబు కొడాలినానికి రాజకీయ భిక్ష పెట్టారన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ…చంద్రబాబు తనయుడు లోకేష్ వైయస్ భిక్ష వల్లే ఎమ్మెల్సీ అయ్యాడని లాజిక్‌తో కొట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనకు రాజకీయ భిక్ష పెట్టడమేంటి?.. అసలు వైఎస్ శాసన మండలి ఏర్పాటు చేయకపోయి ఉండుంటే లోకేష్ మంత్రి అయ్యేవారు కాదని అన్నారు… కరెక్టుగా చెప్పాలంటే.. నారా లోకేష్ కు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ ఆర్ అని చెప్పి షాక్ ఇచ్చారు. 1985లో ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేస్తే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరిగి మండలిని తీసుకొచ్చారని నాని గుర్తు చేశారు. మండలిలో పెద్దమనుషులు ఉంటె, దాని వలన పరిపాలనలో ఎలాంటి లోపాలు లేకుండా ఉంటాయని నాడు వైఎస్సార్ భావించారని తెలిపారు. ఆరోజు వైయస్ రాజశేఖర్ రెడ్డి మండలిని తీసుకురాకుండా ఉంటే ఈ రోజు శాసనమండలిలో కూర్చునే అవకాశం లోకేష్ కు ఉండేది కాదన్నారు. మేధావుల కోసం మండలిని ఏర్పాటు చేస్తే, చంద్రబాబు చెత్తను తీసుకొచ్చి మండలిలో వేస్తున్నారని లొకేష్‌ను ఉద్దేశిస్తూ… కొడాలి నానీ విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌లపై మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. మొత్తంగా లాజిక్ తీసి మరీ తండ్రీకొడుకులను మంత్రి కొడాలి నాని ఉతికి ఆరేసాడని వైసీపీ నేతలు అంటున్నారు.