ఆర్థికలోటుతో ఉన్న పేదరాష్ట్రంలో శాసన మండలి కొనసాగించడం అవసరమా అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ కూర్చున్న పరిపాలన సాగించవచ్చుని పేర్కొన్నారు. 175 స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెట్టాం. 86 శాతంతో అంటే ఇది నిజంగా ప్రజల సభ. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం. సేవకుల్లా ఉంటామని చెప్పినట్లుగా నడుచుకుంటున్నాం. చట్టాలను చేయడానికి సభ ఏర్పాటైంది. మండలిలో జరిగిన పరిణామాలు నన్ను బాధించాయి. ప్రజా సంక్షేమం కోసం అనేక బిల్లులను చట్టసభలకు తెచ్చాం. 7 నెలలుగా ప్రజల కోసమే పని చేస్తున్నాం. చట్టాలు చేయడానికే ఈ సభ ఏర్పాటైంది. 5 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మండలిలో జరిగిన తంతు మనమంతా గమనించాలన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుంది.
మండలి చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం. మండలి నుంచి సలహాలు, సూచనలు వస్తాయి లేదా బిల్లును తిప్పి పంపిస్తారనుకున్నాం. నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపే అధికారం లేదని చైర్మన్ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించారు. గ్యాలరీలో ఉండి మండలిని చంద్రబాబు నడిపించిన తీరు బాధ కలుగుతోందన్నారు. . మండలి ప్రజల కోసం నడుస్తోందా? ఓడిపోయిన నాయకుల కోసం నడుస్తుందా? అని ఆలోచించాలి. బిల్లు పెట్టిన 12 గంటల్లోపే సవరణ ఇవ్వాలని చైర్మన్ చెప్పారు. చైర్మన్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?. తప్పు జరిగిందని చైర్మన్ చెబుతున్నారు. మండలి కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, డాక్టర్లు, ఇంజినీర్లు, టీచర్లు, రైతులు ఇలా అన్ని వర్గాల మేధావులు ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో మండలి కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై చర్చ జరగాలన్నారు. అనవసరం అయిన పక్షంలో మండలిని లేపేద్దామన్నారు.