ఏపీ ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులను స్పీకర్ షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగా తప్పు చేస్తున్నాను అంటూనే వాటిని సెలెక్ట్ కమిటీకి పంపించారు. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది. స్పీకర్ షరీఫ్ కూడా టీడీపీకి చెందిన వారు. బిల్లులపై మండలిలో చర్చ జరిపి, ఏదైనా లోటుపాట్లు ఉంటే అసెంబ్లీకి తిప్పి పంపించాల్సింది పోయి…ఇలా సెలెక్ట్ కమిటీకి పంపించడం..అప్రజాస్వామికమని..వైసీపీ నేతలతో సహా బీజేపీ, కాంగ్రెస్, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా మండలికి వచ్చి…5 గంటలపాటు గ్యాలరీలో కూర్చుని స్పీకర్ షరీఫ్‌ను ప్రభావితం చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై విరుచుకుపడ్డారు.
రాజధాని అనే10 లక్షల కోట్ల భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం చంద్రబాబు ఏ గడ్డి కరవడానికైనా సిద్ధమే. విలువలు, సిద్ధాంతాలు లేని వ్యక్తులు వ్యవస్థలన్నిటిని బలితీసుకుంటారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా ఇలాగే సాగింది. దానికి ఫుల్ స్టాప్ పడిందన్న విషయం తెలుసుకోలేక పోవడం విషాదం అని ఫైర్ అయ్యారు. ఇక బెజవాడ రౌడీలా ప్రవర్తించి పార్టీకి మంచి పేరు తెచ్చావని 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఒక ఎమ్మెల్సీని మెచ్చుకుని తన స్వభావాన్ని బయట పెట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఎంత ప్రమాదకారులో ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందని, తన మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడని చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
ఇక చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నాడు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బిజెపి పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడు. యూ-టర్నుల్లో యజమానిని మించి పోయాడంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లపై సెటైర్లు వేశారు. మొత్తంగా వికేంద్రీకరణ బిల్లు విషయంలో టీడీపీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.