ప్రముఖ ఇన్స్‌టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల వ్యక్తిగత విషయాలు వాట్సాప్ నుంచి హ్యాకింగ్‌కు గురికావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలో సొంత వాట్సాప్‌ను రూపొందిచాలని భావించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకువేస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించనున్న ఈ వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. అధికారిక సందేశాలను రహస్యంగా ఉంచేందుకు కేంద్రప్రభుత్వం సొంత వాట్సాప్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్న కేంద్రం టెస్టింగ్ చేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ నేతృత్వంలో ప్రస్తుతం వాట్సాప్ టెస్టింగ్ జరుగుతోంది.
దీనికి గవర్న్‌మెంట్ ఇన్స్‌టాంట్ మెసేజింగ్ సర్వీస్ (జిమ్స్) గా పేరు పెడుతున్నారు. ఈ ఏడాది డిశంబర్ లో ఇది అందుబాటులోకి రానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈజిమ్స్ యాప్‌ను తయారుచేస్తోంది. ఇదేసంస్థ ప్రభుత్వ శాఖలకు ఈమెయిల్ సర్వీసులను కూడా అందిస్తోంది. ప్రస్తుతం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్రభుత్వ శాఖలకు సంబంధించి రోజుకు 2 కోట్ల ఈమెయిల్ లను హ్యాండిల్ చేస్తోంది. ప్రభుత్వ విధానాలకు లోబడి జిమ్స్ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌పై మొత్తం నియంత్రణ ప్రభుత్వానికే ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ముందుగా ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రారంభించి తర్వాత మొత్తం 11ప్రాంతీయ భాషల్లో యాప్‌ను తీసుకొస్తారట.. విదేశాంగ శాఖ, కేంద్ర హోంశాఖ, సీబీఐ, మెటీ, నేవీ, రైల్వే శాఖలు టెస్టింగ్ లో పాల్గొంటున్నాయని ప్రస్తుతం 6600 మంది యూజర్లు ఈ యాప్ ద్వారా 20 లక్షల మెసేజ్‌లను జనరేట్ చేసినట్లు అధికారులు చెప్పారు. కీలక సమాచారం హ్యాక్ అవుతుండటంతోనే ఈరోజుల్లో పలు కీలక శాఖలు వాట్సాప్ లేదా ఇతర ఇన్స్‌టాంట్ మెసేజింగ్ సర్వీసులపై సమాచారంను షేర్ చేసుకుంటున్నాయిని ఏదైనా కీలక సమాచారం హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ప్రభుత్వం ఓ సొంత మెసేజింగ్ యాప్‌ను తీసుకురావడంపై నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.