బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్‌ఐతో ఆయన మాట్లాడుతూ.. ఏరాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో కలిసి నడవచ్చని చెప్పారు. వారి అంతర్గత నిర్ణయమన్నారు. ప్రస్తుతం జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, అది వారి అభీష్టమని చెప్పారు. ‘భవిష్యత్‌లో బీజేపీ, టీడీపీ మరోసారి కలిసి పనిచేసే అవకాశముందా.? అనే ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. రాజకీయాల్లో ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేనని, రాయలసీమకు తాము అన్యాయం చేశారని వైసీపీ ఆరోపిస్తోందని, ఆ ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారని అడగ్గా.. తాను సీమనుంచి వచ్చిన వ్యక్తినని, అక్కడే పుట్టిపెరిగిన వ్యక్తినని గుర్తు చేశారు.
రాయల సీమ గురించి మాట్లాడటానికి మీరెవరని, రాయలసీమకు మీరేం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లు ఎవరిచ్చారని నిలదీశారు. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభిస్తే తాను పూర్తి చేశానని ఆయన చెప్పారు. అనంతపురానికి కియా మోటార్స్ ను తాను తీసుకొచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. శ్రీసిటీకి టీడీపీ హయాంలో పలు పరిశ్రమలు వచ్చాయని, జగన్ రాయలసీమకు ఏం చేశారో చెప్పాలన్నారు.