అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై కేసు నమోదు చేశారు. దీనిపై సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. మాజీమంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, బెల్లంకొండ నరసింహాలపై కేసునమోదు చేశామని సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారు.
మభ్యపెట్టి తనభూమి కొనుగోలు చేసారని వెంకటాయపాలెం దళిత మహిళ పోతురాజు బుజ్జి పిర్యాదు చేసిందని మేరీ ప్రశాంతి తెలిపారు. 420 ,506 ,120 b ,ఐపీసీ సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసామని, సీఐడీ విచారణలో వెలుగులోకి ఆసక్తికర విషయాలువచ్చాయన్నారు. 797 తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్ భూములు కొన్నట్టు నిర్ధారణ అయిందని, మొత్తం రూ.3 కోట్లకు చొప్పున ఎకరం భూమి తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించామని, రూ.220 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. అమరావతిలోతెల్లరేషన్ కార్డు హోల్డర్స్‌తో కొనుగోలు చేయించిన వారి వివరాలపై ఆరాతీస్తున్నామని, విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసామన్నారు.
అమరావతిలో 129 ఎకరాలు 131మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ కొనుగోలు చేసారని, పెద్దకాకానిలో 40 ఎకరాలు 43 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ కొన్నారని, తాడికొండలో 190 ఎకరాలు 188 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ రిజిస్టర్ చేసుకొన్నారన్నారు. తుళ్లూరులో 242 ఎకరాలు 238 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ కొన్నారని, మంగళగిరిలో 133 ఎకరాలు 148 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ కొన్నారని, తాడేపల్లిలో 24 ఎకరాలు 49 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ కొన్నారన్నారు. విచారణ వేగవంతం చేసి మాజీ మంత్రులు నారాయణ, పుల్లారావులు తప్పు చేశామని తేలితే త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామన్నారు.