ఏపీ శాసనమండలిలో అధికారవికేంద్రీకరణ బిల్లును, సీఆర్‌డీఏ బిల్లును విజయవంతంగా అడ్డుకున్నామని సంబరాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మండలిలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ చేసింది. అయితే బిల్లుకు ఓటింగ్ సమయంలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలు ఓటేశారు. దీంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. విప్‌కు వ్యతిరేకంగా ఓటేసిన పోతుల సునీతపై చర్యలు తీసుకునేందుకు టీడీపీ సిద్ధమైంది.
కాగా పోతుల సునీత, తన భర్త పోతుల సురేష్‌తో కలిసి పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. సునీత భర్త పోతుల సురేష్ ఒప్పుడు మావోయిస్ట్ కీలక నేతగా చక్రం తిప్పారు…అలాగే దివంగత పరిటాల రవికి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. త్వరలో ఇద్దరూ…సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోతుల సునీత అమరావతిలో ఉండగా, సురేష్ కర్నూలు నుంచి అమరావతికి చేరుకుంటున్నట్లు సమాచారం. అయితే వైసీపీలో చేరిన తర్వాత పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా లేదా…వల్లభనేని వంశీ తరహాలో స్వతంత్ర్య ఎమ్మెల్సీగా వ్యవహరిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక పోతుల సునీత బాటలో అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్సీ శమంతకమణి కూడా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో చంద్రబాబు జేసీ దివాకర్‌రెడ్డికి ప్రాధాన్యం ఇస్తూ తన కుటుంబాన్ని పక్కన పెడుతుండడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న శమంతకమణి పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నామని ఆనందంలో ఉన్న చంద్రబాబుకు ఇద్దరు ఎమ్మెల్సీలు అదిరిపోయే షాక్ ఇచ్చారనే చెప్పాలి.