ఏపీలో .ప్రభుత్వం ప్రజాహితం కోసం ప్రవేశపెట్టే బిల్లులను టీడీపీ కావాలనే మండలిలో అడ్డుకుంటుందా…వికేంద్రీకరణ బిల్లు విషయంలో జరిగిన పరిణామాలపై జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉందా…ఏపీ శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా…ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ‌్యంలో ప్రభుత్వం ఏపీ శాసనమండలి రద్దుపై ముందడుగు వేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన జగన్ సర్కార్…వాటిని శాసనమండలిలో ప్రవేశపెట్టింది. అయితే శాసనమండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ రెండు బిల్లులను తెలివిగా తమ పార్టీకే చెందిన స్పీకర్ షరీఫ్‌ను అడ్డంపెట్టుకుని సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీంతో మూడు నెలల పాటు మూడు రాజధానులపై ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది.
టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా మండలి గ్యాలరీలో 5 గంటల పాటు కూర్చుని, ఒకపక్క తమ ఎమ్మెల్సీలతో గలాటా చేయిస్తూ మంత్రులను అడ్డుకుంటూ..మరోవైపు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిపేలా స్పీకర్‌ను ప్రభావితం చేశారు. కాగా శాసనమండలిలో జరిగిన పరిణామాల పట్ల ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల ఇంగ్లీష్ మీడియం వంటి మంచి బిల్లును శాసనమండలి స్పీకర్ ఆమోదించకుండా..తిరిగి సూచనలు, సవరణల పేరుతో వెనక్కిపంపారు. దీంతో అసెంబ్లీ మరోసారి ఇంగ్లీష్ మీడియం బిల్లును ఆమోదించాల్సి వచ్చింది. ఇప్పుడు వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లును మండలి స్పీకర్ షరీఫ్ తాను తప్పు చేస్తున్నా అంటూనే…విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపడం పట్ల ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో ప్రభుత్వం ఏకంగా శాసనమండలిని రద్దు చేయనున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ శాసనమండలి రద్దుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ… తొత్తుల్ని తీసుకొచ్చి ఉన్నతస్థానంలో కూర్చోబెట్టారు. అందుకే మండలి రద్దు ఆలోచన చేయాల్సి వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు పాటించాలని చెప్పినా ఛైర్మన్ పాటించలేదని మంత్రి తీవ్రంగా ఆక్షేపించారు.. జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులనుబట్టీ ఇలాంటి వ్యవస్థ ఉండాలా లేదా అన్న చర్చే సర్వత్రా ఇప్పుడు నడుస్తోందన్నారు. స్పీకర్ వంటి ఉన్నత పదవుల్లో తాబేదార్లను కూర్చోబెట్టే వ్యవస్థపై చర్చ జరగాలన్నారు. శాసనమండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేయనున్నట్లు తెలిపారు. మూడు రాజధానులపై ఎన్ని అడ్డంకులు వచ్చినా తాము ముందుకెళ్తామని బొత్స స్పష్టం చేశారు. మొత్తంగా ఏపీ శాసనమండలి రద్దుపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ..మంత్రి బొత్స వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి.