ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నిన్న శాసనమండలిలో టీడీపీ విప్ ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఆమె ఓటు వేశారు. అనంతపురం జిల్లా పరిటాల రవి అనుచరుడు పోతుల సురేశ్ భార్య పోతుల సునీత అనే విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరడంతో… పోతుల సునీతకు ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం కల్పించారు. తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలను అప్పగించారు. టీడీపీలో క్రియాశీలంగా ఉండే ఆమె ఇప్పుడు పార్టీ మారాలనుకోవడం చర్చనీయాంశం అయింది
