ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ అధికార వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన తర్వాత గత నెలరోజులుగా ఆందోళనలతో అట్టుడికి పోయిన అమరావతి గ్రామాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన కొన్ని గ్రామాల రైతులు ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు. అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం జగన్ రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులపై వరాల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ. 2, 500/- పరిహారాన్ని రెట్టింపు చేసింది. ఇక నుంచి నెలనెలా 5 వేల పరిహారం అందుకోనుండడంతో రాజధాని గ్రామాల రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా పట్టారైతులకు సమానంగా పెంచిన పరిహారాన్ని అసైన్డ్ రైతులకు కూడా ప్రభుత్వం వర్తింపజేసింది.అలాగే రాజధానిలో భూమిలేని రైతు కూలీలకు కూడా ప్రతి నెలా రూ. 5000/- మొత్తాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిన్నటి వరకు ఆందోళనలు, ధర్నాలతో అట్టుడిన రాజధాని గ్రామాల్లో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.అధికార వికేంద్రీకరణ బిల్లుకు కొన్ని గ్రామాల రైతులు మద్దతు పలుకుతున్నారు. థ్యాంక్యూ సీఎం సర్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
తాజాగా జనవరి 21 న సీఎం కాన్వాయ్ అసెంబ్లీకి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా రైతులు పెద్ద సంఖ్యలో జగన్ , అంబేద్కర్ ఫోటోలను నిల్చుని ఉన్నారు. సీఎం జగన్ కాన్వాయ్ రాగానే థ్యాంక్యూ సీఎం సర్… జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అమరావతిలోని ప్రధానంగా మందడం, తుళ్లూరు, వెలగపూడి వంటి ఐదారుగ్రామాల్లో తప్పా..మిగతా గ్రామాల రైతులు అధికార వికేంద్రీకరణకు జై కొడుతున్నారు. తమ సమస్యలు సీఎం జగన్ తీరుస్తాడని, మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని మెజార్టీ గ్రామాల రైతులు అంటున్నారు. అధికార వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన తర్వాత అమరావతిలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయనుకున్న వైసీపీ నేతలు ఇవాళ్టి సీన్ చూసి ఊపిరిపీల్చుకున్నారు. మొత్తంగా మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత అమరావతి గ్రామాల్లో పరిస్థితులు ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుండడంతో ప్రతిపక్షనేత చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయినట్లయింది.