ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుపై బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్టం చేశారు. కాగా అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్న చంద్రబాబు తీరుపై జీవీఎల్ మండిపడ్డారు. గతంలో శివరామకృష్ణన్ కమిటీ వద్దని చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిందని విమర్శించారు. అమరావతిలో మొదటి ముద్దాయి..చంద్రబాబు అని సంచలన వ్యాఖ్యలు చేశారు..చంద్రబాబు ఓ దద్దమ్మ…ఆయన ప్రభుత్వం ఓ దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. అమరావతిలో నాలుగేళ్లలో నాలుగు బిల్డింగులు కూడా కట్టని చంద్రబాబు.. చేతగాని వ్యక్తి అని జీవీఎల్ తీవ్రంగా ధ్వజమెత్తారు.
అమరావతి పేరుతో సేకరించిన నిధులను చంద్రబాబు స్వాహా చేశారని, నిర్మాణాలతో పేరుతో వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ నేతలు అంటున్నారని దుయ్యబట్టారు. తాము పెద్దన్నగా వ్యవహరిస్తే 23 మంది ఎమ్మెల్యేలున్న టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా అని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ హయాంలోనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేశామని.. అయితే అప్పుడు చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని, కాని ఇప్పుడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తమ పార్టీ జగన్ సర్కారుకు పూర్తిగా సహకారం అందిస్తుందని జీవీఎల్ తెలిపారు. కాగా మూడు రాజధానుల బిల్లుకు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుండడంతో ఇప్పటిదాకా మూడు రాజధానులపై గందరగోళంలో ఉన్న కాషాయపార్టీ ఇప్పుడు అధికార వికేంద్రీకరణకు జై కొడుతుంది. మరోవైపు చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తోంది.మొత్తంగా మూడు రాజధానుల బిల్లుపై స్పందిస్తూ చంద్రబాబును దద్దమ్మ అంటూ జీవిఎల్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.