ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ మరో షాక్ తగిలిందని వార్తలు వస్తున్నాయి.ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్సీ ,మాజీ మంత్రి డొక్కా మాణిక్ వర ప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. అదేవిధంగా తన రాజీనామా లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో భవిష్యత్‌లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకూడదని నిశ్చయించుకున్నట్లు డొక్కొ ఆ లేఖలో పేర్కొన్నారు. గత కొంతకాలంగా డొక్కా పార్టీలో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు.కొన్ని అంశాలలో పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు వైఖరితో ఆయన అసంతృప్తి తో ఉన్నారని సమాచారం. శాసనమండలిలో టిడిపికి మెజార్టీ ఉన్న సంగతి తెలిసిందే. మూడు రాజదానుల అంశంపై శాసనమండలిలో టిడిపి సబ్యులు వ్యతిరేకించాలని విప్ జారీ చేశారు. ఈ రోజు డొక్కా మండలికి హాజరు కాలేదు. దీంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. కీలక బిల్లు నేపథ్యంలో మండలికి హాజరుకావాలని చంద్రబాబు ఫోన్ చేసినా డొక్కా స్పందించలేదని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. కాగా, ఈ రోజు మండలి సమావేశానికి డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో పాటు శమంతకమణి, నామినేటెడ్ ఎమ్మెల్సీ రత్నబాబు కూడా హాజరుకాకపోవడం గమనార్హం.
