ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ సర్కార్ ముందడగు వేసింది. తాజాగా ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలన రాజధాని , కర్నూలులో , న్యాయ రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక రాజధాని గ్రామాల రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏరియా కూడా ఏర్పడనుందని వెల్లడించారు. అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారని బుగ్గన తెలిపారు.
విశాఖలో రాజ్‌భవన్, సచివాలయం ఉంటాయని, కర్నూలులో న్యాయపరమైన అన్ని శాఖలు ఉంటాయని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. హైకోర్టు అనుమతి అనంతరం వీటిని తరలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని… 3,4 జిల్లాలను కలిపి ఒక జోనల్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి బుగ్గన సభకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రైతులు రాజమహల్‌లు అడగడం లేదని, పొలాలకు నీళ్లు కావాలని మాత్రమే కోరుతున్నారని మంత్రి బుగ్గన అన్నారు. ప్రజలు మంచి పరిపాలనను కోరుకుంటున్నారని, శ్రీకృష్ణదేవరాయ కాలంలో రాజమహల్‌లు లేవని, చెరువులే తవ్వించారన్నారని అన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం, పన్నులను బట్టే పరిపాలన ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందంలో రాయలసీమకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఈ మేరకు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం సముచితమైన నిర్ఱయమని, సీమవాసుల చిరకాల కోరిక కూడా అదేనని బుగ్గన అన్నారు.
ఇక ఆందోళనలు చేస్తున్న రాజధాని రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అమరావతి రైతులకు మెరుగైన ప్యాకేజీకి ప్రభుత్వం తీర్మానం చేసింది. అలాగే రాజధానికి భూములిచ్చిన రైతులకిచ్చే కౌలు 10 నుంచి 15 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని కూడా రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అయితే అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ నచ్చని రైతులకు భూములు వెనక్కు ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. మొత్తంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా గత నెలరోజులుగా రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతూ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నా..ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేయడంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.