రాజధాని రాజకీయంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలె పట్టుకుని అడుక్కుంటూ బిజీబిజీగా జిల్లాలు పర్యటిస్తున్న వేళ.. కడప జిల్లాలో టీడీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సీఎం జగన్ దెబ్బకు కడప జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ కీలక నేతలు సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి వంటి నేతలు బీజేపీలో చేరిపోయారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు వీర శివారెడ్డికి ఆయన సొంత నియోజకవర్గం కమలాపురం టికెట్ ఇవ్వలేదు..దీంతో వీర శివారెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు.కాగా కమలాపురంలో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన వెంటనే రవీంద్రనాథ రెడ్డి వీరశివారెడ్డి ఇంటికి వెళ్లి కృతజ్ఙతలు తెలపడం అప్పట్లో సంచలనంగా మారింది. ఎన్నికల తర్వాత వీర శివారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇటీవల కడపలో నిర్వహించిన జిల్లాస్థాయి పార్టీ సమావేశానికి కూడా వీర శివారెడ్డి డుమ్మా కొట్టారు.
అయితే తాజాగా వీరశివారెడ్డి అధికారికంగా వైసీపీలో చేరడం ఖాయమైంది. జనవరి 18న కమలాపురం నియోజకవర్గం పరిధిలోని కోగటంలో గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డితో పాటు వీరశివారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో సీఎం జగన్ సమక్షంలో వీరశివారెడ్డి వైసీపీలో చేరనున్నట్లు రవీంద్రనాథ్ రెడ్డి ప్రకటించడంతో టీడీపీ ఒక్కసారిగా షాక్ గురైంది. మొత్తంగా కడప జిల్లాలో సీనియర్ నేత అయిన వీరశివారెడ్డి నిజంగానే వైసీపీలో చేరితే.. చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.