నా క్కొంచెం తిక్కుంది..కాని దానికో లెక్కుంది…ఇది గబ్బర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫేమస్ డైలాగ్.. అయితే రాజకీయాల్లో మాత్రం నిజంగానే పవన్ తిక్కకు నిజంగానే ఓ లెక్కుంది..అది చంద్రబాబుకే తెలుసంటూ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తుంటారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు కాపు కాస్తున్న పవన్‌కల్యాణ్‌పై ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. వైసీపీ నేతలు కూడా పవన్ చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడుపోయాడని, బాబుకు దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నాడని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ కనుమపండుగ రోజు బీజేపీతో కుదుర్చుకున్నారు. ఆర్నెళ్ల క్రితం వరకూ బీజేపీతో పొత్తు పెట్టుకుంటామా..మోదీ లాంటి ఫాసిస్ట్‌తో చేతులు కలుపుతామని అని డైలాగులు కొట్టిన పవన్..ఇప్పుడు అకస్మాత్తుగా కాషాయగూటిలో చేరడం వెనుక బాబు హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు చంద్రబాబే పవన్ కల్యాణ్‌ను ముందు జాగ్రత్తగా బీజేపీలోకి పంపించాడని విమర్శలు వస్తున్నాయి.
తాజాగా జనసేన, బీజేపీల పొత్తుపై వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ..పవన్ కల్యాణ్‌పై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను అందరూ పొత్తుల కల్యాణ్.. ప్యాకేజ్ కల్యాణ్ అని చెప్పుకుంటారని…ఆయన ప్యాకేజీల కోసమే పార్టీ పెట్టినట్లుగా ఉందని రోజా సైటర్ వేశారు. పవన్‌కు ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా లేదని, అందుకే ప్యాకేజీలకు అమ్ముడుపోతూ…ఇలా పొత్తులు పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకుంటారని రోజా ఫైర్ అయ్యారు. ఈ కారణంతోనే పవన్ ను రెండుచోట్ల ప్రజలు ఓడించారని ఎద్దేవా చేశారు..అసలు చంద్రబాబుకు రహస్య మిత్రుడైన పవన్ కల్యాణ్‌తో పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ పెద్దలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తనకు అర్థం కావటం లేదని రోజా అన్నారు.. పవన్ తో పొత్తు అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడమేనని వ్యంగ్యస్త్రాలు సంధించారు. మొత్తంగా బీజేపీతో పొత్తుపెట్టుకున్న పవన్ కల్యాణ్‌ను రోజా తన తూటాల్లాంటి డైలాగులతో, జబర్దస్త్ పంచ్‌లతో చెడుగుడు ఆడేసుకున్నారు. ప్రస్తుతం పవన్‌పై రోజా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి.