ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనల కార్యక్రమాల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ కూడా పాల్గొంటూ రాజధాని రాజకీయంలో సెంటిమెంట్ పండిస్తున్నారు. అమరావతి జేఏసీ కోసం భువనేశ్వరీ తన రెండు బంగారు గాజులను విరాళంగా ఇచ్చారు. భువనేశ్వరీ గాజుల త్యాగంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు..ఇవ్వాల్సింది గాజులు కాదని..మీ భర్త చంద్రబాబు రైతుల నుంచి లాక్కున్న భూములు, మీ హెరిటేజ్ కంపెనీ దోచుకున్న భూములంటూ వైసీపీ నేతలు భువనేశ్వరీకి కౌంటర్ ఇచ్చారు.
తాజాగా స్వర్గీయ ఎన్టీఆర్సం వర్దంతి సందర్భంగా ఆయన సతీమణి, వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చంద్రబాబు, నారాభువనేశ్వరీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని లక్ష్మీ పార్వతి తెలిపారు. అన్యాయంగా కొంతమంది ఎన్టీఆర్ ని అధికారం నుంచి తొలగించి – ఆయన చనిపోవడానికి కారణమయ్యారని, పరోక్షంగా చంద్రబాబు వెన్నుపోటును ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. చివరినిమిషాల్లో ఎన్టీఆర్ పడ్డ బాధ – ఆవేదన నాకు ఒక్క దానికి మాత్రమే తెలుసు అని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక అమరావతి ఆందోళన కార్యక్రమాల్లో నారాభువనేశ్వరీ పాల్గొనడంపై లక్ష్మీ పార్వతి స్పందించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో తన కొడుకు నారా లోకేష్ కోసం వందల ఎకరాల భూములు కొన్నారు కాబట్టే వాటిని కాపాడుకోవటం కోసం భువనేశ్వరి రాజధాని రైతుల పోరాటంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారని, ఇంతకంటే ఆమె గురించి మాట్లాడనని లక్ష్మీ పార్వతి అన్నారు. మొత్తంగా స్వర్గీయ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా చంద్రబాబు, భువనేశ్వరీలపై లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.