ఏపీలో జగన్ సర్కార్ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుందంటో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో అదీ ముఖ్యంగా తుళ్లూరు, మందడం, వెలగపూడి వంటి 5, 6 గ్రామాల్లో జరుగుతున్న ఆందోళలను బాబుగారి అనుకుల మీడియా ఛానళ్లు, పత్రికలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నంతగా చూపిస్తున్నాయి. అమరావతికి అను”కుల” కథనాలతో పాటు, ప్రభుత్వంపై రోజూ అసత్యకథనాలతో దుష్ప్రచారం చేస్తున్నాయి. తాజాగా బాబుగారి సామాజికవర్గానికి చెందిన మీడియాపై వైసీపీ సీనియర్ మంత్రి బొత్స విరుచుకుపడ్డారు. 17 వ తేదీ సీఎం జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ తర్వాత మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్న ఛానెళ్లు, పత్రికల పేర్లు చెప్పి మరీ వాళ్లు చేస్తున్న అవాస్తవాలను మీడియా ముందు బయటపెట్టారు.
అమరావతి రాజధానికి సంబంధించి చెన్నై ఐఐటీ ఓ నివేదిక ఇచ్చిందంటూ చంద్రజ్యోతి పత్రిక 2 రోజులుగా తెగ ఊదరగొడుతోంది. ఈ నివేదికను కూడా పక్కనపెట్టి జగన్ సర్కార్ వ్యవహరిస్తోందంటూ అవాస్తవాలు ప్రసారం చేస్తోంది. ఈ కథనాలపై మంత్రి బొత్స ఘాటుగా స్పందించారు. కావాలంటే చెన్నై ఐఐటీకి లేఖ రాయాలని, అలాంటి నివేదిక ఇచ్చామని ఐఐటీ కనుక సమాధానం చెబితే తలదించుకొని వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశారు. అలాగే అమరావతి ప్రాంతంలో చంద్రబాబు వందల కోట్లు పెట్టి నిర్మించిన శాశ్వత భవనాల్ని వీడి, రాజధానిని తరలించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ బాబుగారి రాజగురువు పత్రిక ప్రచురించిన అసత్యకథనాలపై కూడా మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఐదేళ్ల పదవీకాలంలో చంద్రబాబు ఎప్పుడైనా అమరావతి నిర్మాణాలన్నీ తాత్కాలిక భవనాలే అని చెప్పలేదా..ఏనాడైనా శాశ్వత భవనాలుగా చెప్పారా అని సదరు మీడియా ప్రతినిధిని నిలదీశారు.
ఇక అమరావతి ప్రాంత రైతులతో ఒక్కనాడు కూడా సంప్రదించకుండా జగన్ ప్రభుత్వం మూడు రాజధానులపై ముందుకు వెళుతుందంటూ.. బాబుగారికి డప్పుకొట్టే ఆ రెండు ఛానళ్లు సంయుక్తంగా ప్రసారం చేసిన వార్తలను మంత్రి బొత్స తిప్పికొట్టారు. రైతుల అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఈ-మెయిల్ ఇచ్చామని, వాటికి లెక్కలేనన్ని అభిప్రాయాలు వచ్చాయన్నారు. తను కూడా స్వయంగా 5 గ్రామాల ప్రజలతో సంప్రదింపులు జరిపి, వాళ్ల అభిప్రాయాలు తెలుసుకున్నానని అన్నారు. కావాలంటే ఆ ఫొటోలు కూడా మీడియాలో వచ్చాయని, చూసుకోమని సదరు మీడియాకు గడ్డిపెట్టారు. అలాగే అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను గాలికి వదిలేస్తారనే ప్రచారంపై కూడా బొత్స తీవ్రంగా స్పందించారు. 25శాతం దాటిన నిర్మాణాల్ని కొనసాగిస్తామని, వాటిని వాడుకలోకి కూడా తీసుకొస్తామని స్పష్టంచేశారు.
ఇక అమరావతి నుంచి రాజధానిని ప్రభుత్వం తరలిస్తుందంటూ బాబుగారి అనుకుల మీడియా చేస్తున్న ప్రచారాన్ని మంత్రి బొత్స ఖండించారు. అమరావతి నుంచి రాజధానిని తరలించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. అమరావతి ఎప్పటికీ లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంటుందని, ఇక్కడ సౌకర్యాల కోసం ఆ భవనాల్ని వాడుకుంటామని, దేన్నీ వృధాగా వదిలేయమని క్లారిటీ ఇచ్చారు. ఇక అమరావతి రైతుల ఆందోళనలపై కూడా బొత్స స్పందించారు. హైపవర్ కమిటీ అభిప్రాయాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, రైతుల పట్ల జగన్ సానుకూలంగా స్పందించారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలకు అనుగుణంగా, అవసరమైతే అంతకంటే ఎక్కువగానే రైతులకు లబ్ది చేకూరేలా కార్యాచరణ సిద్ధంచేయమని సీఎం జగన్ సూచించినట్టు తెలిపారు. మొత్తంగా చంద్రబాబుకు అనుకులంగా కమ్మటి కథనాలు వడ్డిస్తూ..అమరావతి ఆందోళనలను భూతద్దంలో చూపిస్తూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న కొన్ని ఛానళ్లు, పత్రికల తీరును మంత్రి బొత్స తీవ్రంగా ఎండగట్టారు.