సినీ నటుడు పృథ్వీరాజ్ ఆడియో టేపుల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పనిచేస్తున్న పృథ్వీ తన దగ్గర పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగినితో సరస సంభాషణలు జరిపినట్లు ఓ ఆడియో టేప్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ ఆడియో టేపు వివాదంపై సీఎం జగన్ సీరియస్ కావడంతో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు. తనపై మీడియాలో ప్రచారమవుతున్న ఆ ఆడియో టేపు ఫ్యాబ్రికేటెడ్ అని…తన తప్పు లేదని తేలిన తర్వాతే మళ్లీ విధుల్లో చేరుతానని పృథ్వీ ప్రకటించారు.
కాగా పృథ్వీపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఊహించని ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. ఈ ఆడియో టేపు వ్యవహారంలో ఇప్పటివరకు పృథ్వీపై కేసులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆఖరకు పృథ్వీతో ఫోన్‌లో మాట్లాడిన మహిళ కూడా ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతోంది. తాను ఇప్పటికే అల్లరి పాలయ్యానని..ఇప్పుడు కంప్లైంట్ చేసి..పోలీసుల చుట్టూ, టీటీడీ అధికారుల చుట్టూ తిరగలేనని సదరు మహిళ విజిలెన్స్ అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వారు తలలు పట్టుకుంటున్నారు. బాధితురాలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయకపోతే..చట్టపరంగా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని..పోలీసులు, విజిలెన్స్ అధికారులు అంటున్నారు.
తాజాగా ఈ ఆడియో టేపు వ్యవహారంలో మరో ఊహించని ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు మహిళల ప్రమేయం ఇందులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో విజిలెన్స్ అధికారులు టాలీవుడ్‌కు చెందిన ఆ ఇద్దరు మహిళలకు, బాధిత మహిళకు ఉన్న లింకుపై కూడా ఆరా తీస్తున్నారు. కాగా ఫోన్‌లో పృథ్వీతో మాట్లాడిన మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ కేసులో విచారణ జరపడం అధికారులకు క్లిష్టంగా మారింది. మొత్తంగా ఊహించని ట్విస్ట్‌లతో పృథ్వీరాజ్ ఆడియో టేపు వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఈ కేసు నుంచి పృథ్వీ బయటపడతాడో లేదో చూడాలి.