తెలంగాణ మున్సిపాలిటీలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార సరళి, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలకు భారీగా నిధులిచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ అభ్యర్థులకు మార్గనిర్దేశనం చేశారు.
ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పట్టణాల్లో విద్యుత్, మంచినీటి సమస్య లేకుండా చేశాం. 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేదు. 75 గజాల ఇంటి స్థలం ఉన్నవారికి 22 రోజుల్లో అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తాం. ఎక్కడికక్కడా మ్యానిఫెస్టోలు రూపొందించుకుని ప్రచారం చేయండని అభ్యర్థులకు కేటీఆర్ సూచించారు. గెలుపు మనదే..అతివిశ్వాసంతో ఉండకుండా ప్రచారాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.