ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు గత నెల రోజులుగా అందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులు ఎక్కువగా ఉన్న తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో మాత్రమే ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. రాజధాని తరలిపోతే..చావే శరణ్యమన్నట్లుగా రైతులను మానసిక ఆందోళనకు గురి చేస్తూ..వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు చంద్రబాబు. కాగా రాజధాని గ్రామాల రైతుల్లో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది.
తాజాగా 29 గ్రామాల్లో బాబు సామాజికవర్గం 80 శాతం ఉన్న తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో తప్పా..మిగతా 26 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం.. రెండు ఎకరాల్లోపు భూమిని ఇచ్చిన దాదాపు 15 వేల మంది రైతులు తమ భూములు వెనక్కి తీసుకోవడానిక సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రులు కొడాలి నాని, బొత్స సత్యనారాయణలను మెజారిటీ గ్రామాల రైతులు కలిసారు. ప్రభుత్వం తమ భూములు తిరిగి ఇచ్చేస్తే…అంగీకరిస్తామని రైతులు మంత్రులకు స్పష్టం చేసినట్లు సమాచారం. కాని భూమి చదును చేసుకుని మళ్లీ వ్యవసాయయోగ్యంగా మార్చుకోవడానికి తగిన పరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తే..తమ భూములు తాము వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని రైతులు మంత్రులకు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న అమరావతి ప్రాంత రైతుల్లో చీలిక వచ్చినట్లయింది.
అయితే మెజారిటీ గ్రామాల రైతులు భూములు తిరిగి తీసుకునేందుకు సిద్ధమవడాన్ని బాబు సామాజికవర్గ రైతులు తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో ఉండేలా ప్రభుత్వం ప్రకటన చేసేవరకు తమతో కలిసి పోరాడాలని మూడు గ్రామాల రైతులు మిగిలిన 26 గ్రామాల రైతులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. కాని రెండు ఎకరాల్లోపు భూములు ఇచ్చిన రైతులు మాత్రం తమ భూములు ప్రభుత్వం తిరిగిఇచ్చేస్తే చాలు..తీసుకోవడానికి తాము సిద్ధమని అంటున్నారు. మొత్తంగా సేవ్ అమరావతి పేరుతో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్న 29 గ్రామాల రైతుల్లో చీలిక వచ్చినట్లు రాజధాని ప్రాంతంలో చర్చ జరుగుతోంది. మరి రాజధాని రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.