భోగి పండుగ అనగానే పెద్దవాళ్లదగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు ఎంతో ఉత్సాహంగా భోగిమంటలు వేస్తారు.ఈ భోగిమంటల్లో ఆవు పిడకలతో పాటు, ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారు గొప్ప అన్న మాట.అయితే ఈ భోగిమంటల వెనుక ఓ పరమార్థం దాగి ఉంది. పనికి రాని చెడు పాత ఆలోచనలను వదిలించుకొని కాలంతో బాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనసును సిద్ధం చేయటమే ఈ భోగి మంటల వెనకున్న పరమార్థం. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు , మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి. భోగిమంటల వెనుక ఇంకో పరమార్థం దాగి ఉంది. దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, బాధలను భోగిమంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ప్రసాదిం చమంటూ ప్రజలు ప్రార్థిస్తారు. భోగి పండుగ మనలోని ఆశావహ దృక్పథానికి సంకేతం. అలాగే భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని విశ్వాసం.