ఏపీలో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా.. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను.. రాష్ట్రస్థాయిలో ఉద్యమంగా మల్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలలో యాత్రలు మొదలుపెట్టారు. మచిలీపట్నం, రాజమండ్రి, తిరుపతిలలో పర్యటించి, స్వయంగా భిక్షాటన చేసి జేఏసీ సభలలో మాట్లాడిన చంద్రబాబు తాజాగా అనంతపురం జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నిప్పులు చెరిగారు. జీవితకాలంలో రాయలసీమకు అడుగడుగునా అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పర్యటనకు వస్తారని ఎంపీ మాధవ్ ప్రశ్నించారు. బాబు పేరు వింటేనే సీమవాసులు మండిపడుతున్నారని ఆయన అన్నారు. ‘‘సీఎం జగన్ సరేనంటే.. వైసీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నలిస్తే నేను స్వయంగా రంగంలోకి దూకి చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటా.. చంద్రబాబు ముఖం పగలగొట్టడానికి రాయలసీమ ప్రజలు రెడీగా ఉన్నారు” అంటూ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా చంద్రబాబు అనంతపురం పర్యటన సందర్భంగా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు నేను ఒకటే చెబుతున్నా..మీకు నిజంగా మగతనం ఉంటే..పోలీసులు లేకుండా ప్రజల్లోకి రావాలి. అంతేగానీ కొజ్జాలను అడ్డం పెట్టుకుని అందరిని చావగొట్టడం ఎందుకంటూ జేసీ మరోసారి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే పోలీసులను నా బూట్లు నాకిస్తా అంటూ గతంలో జేసీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పోలీస్ బూట్లను ముద్దాడి మరీ గోరంట్ల కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ కామెంట్లపై, బాబుతీరుపై గోరంట్ల మండిపడ్డారు. ఇద్దరూ రాయలసీమ ద్రోహులే..ఒకరేమో రాయలసీమను వెనుకబాటుకు గురిచేశారు. ఇంకొకరేమో పోలీసులతో బూట్లు నాకిస్తానని పిచ్చికూతలు కూశారు. సీఎం అనుమతిస్తేగనుక వీళ్లిద్దరినీ నేనే అడ్డుకుంటా అంటూ గోరంట్ల ఫైరయ్యారు. మొత్తంగా చంద్రబాబు అనంతపురం పర్యటన నేపథ‌్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.