ఏపీలో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు పక్కదోవ పడుతున్నాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్నా..ప్రధానంగా తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్దండరాయపాలెం వంటి 5 గ్రామాల్లో ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా
ఈ ఆందోళన కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొంటుండడంతో మహిళా పోలీసులు గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న మహిళలను మహిళాపోలీసులు అదుపులోకి తీసుకుంటూ..ఆ తర్వాత వారిని వదిలేస్తున్నారు. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు రాజధాని గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై అమరావతి ఆందోళనకారులు కొందరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ సిబ్బంది వద్దకు వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంటున్నారు… మీరు భర్తలతో ఇంకేం కాపురం చేస్తారు. మా దగ్గర పడుకోండి అంటూ అసభ్య పదజాలంతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా మహిళా రైతులపై పోలీసుల దాడులు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో జాతీయ మహిళా కమిషన్ దాన్ని సుమోటోగా తీసుకుని అమరావతికి ఓ విచారణ కమిటీని పంపింది. ఆ కమిటీ అమరావతి గ్రామాల్లో పర్యటిస్తూ మహిళల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా రాజధాని గ్రామాల్లో తమకు ఎదురవుతున్న లైంగిక వేధింపుల గురించి మహిళా పోలీసులు జాతీయ మహిళా కమీషన్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు రూరల్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి. మాణిక్యాల రావు, సంఘం సభ్యులు వెంకటేశ్వర రావు, వీరనాగులు, లక్ష్మయ్యలతో కలిసి మహిళా సిబ్బంది అయిన సంధ్యారాణి, అనంత కృష్ణ, శిరీషా, కుమారి, వెంకటేశ్వరమ్మ, అప్పమ్మ, పద్మ, శ్యామల తదితరులు జాతీయ మహిళా కమిషన్ సీనియర్ కోఆర్డినేటర్ కాంచెన్ ఖత్తర్‌ను కలసి తమకు అమరావతి గ్రామాల్లో ఎదురవుతున్న లైంగిక వేధింపులపై గురించి తెలుపుతూ ఓ వినతి పత్రం అందజేశారు.
తమకు కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని, వాటర్ బాటిల్స్ కొనుక్కుందామని షాపులకు వెళ్లినా మీకు అమ్మేది లేదని బూతులు తిడుతున్నారని,…తమ మోటారు సైకిళ్లలో గాలి తీస్తున్నారని మహిళా పోలీసులు వాపోయారు. మహిళా పోలీస్ సిబ్బందిలో కొందరు గర్భవతులు, పెద్దవయసు వారు, ఆరోగ్యం బాగాలేని వారు ఉన్నారు. వారు ఎక్కుసేపు నిలబడలేక ఎక్కడైనా కూర్చుందామని వెళితే అక్కడ ఆయిల్, నీళ్లు, కారం పొడి చల్లుతున్నారు. అదేమని అడిగితే మా గ్రామం విడిచి వెళ్ళండంటూ బూతులు తిడుతున్నారని, కనీసం ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి కూర్చుందామన్నా వాటికి కూడా తాళాలు వేస్తున్నారని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.
పైగా గ్రామాల్లో ఆందోళనలు చేస్తున్న మగవాళ్లు కొందరు డ్యూటీలో ఉన్న తమ వద్దకు వచ్చి… ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంటున్నారు. మీరు భర్తలతో ఇంకేం కాపురం చేస్తారు. మా దగ్గర పడుకోండి అంటూ అసభ్యంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మహిళా పోలీసులు కన్నీళ్లు పెట్టుకున్నారు. 144 సెక్షన్ అమలులో ఉండగా విధులు నిర్వహిస్తున్న తమను చుట్టుముట్టి కొట్టడం, కొరకడం, గిల్లడం, గిచ్చడం, తాకరాని ప్రదేశాల్లో తాకి వేధిస్తున్నారని మహిళా పోలీసులు జాతీయ మహిళా కమీషన్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. అమరావతి ఆందోళనకారులు విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై లైంగిక వేధింపులకు పాల్పడడం క్షమించరాని విషయం. పోలీసులు తమ తోటి మహిళా పోలీసులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కామాంధులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.