రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవడానికి, విభజన చట్టంలోని అంశాలు అమలు కాకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారకుడని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాదివిష్ణు మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలకోసం చంద్రబాబు, గత ఐదేళ్లలో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని విమర్శించారు. మేము అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే బీజేపీ నేతలకు బాధఎందుకు కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. కాషాయ కండువా కప్పుకున్న సుజనా చౌదరి అమరావతి ముసుగులో ఐదేళ్లలో టీడీపీ చేసిన అక్రమాలు వెలికి తీస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో బీజేపీ మూడు ముక్కలయిందని పొంతనలేని వ్యాఖ్యలుచేస్తూ సుజనా ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు. పూటకో మాట మాట్లాడే పవన్‌కి జనం తీర్పు ఇచ్చిన తర్వాత కూడా బుద్ధి రాలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుట్రలను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. పత్రికలను అడ్డం పెట్టుకొని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాభిప్రాయమే మాకు శిరోధార్యమని, అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ అంతిమ లక్ష్యమని మల్లాది వెల్లడించారు.
