ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం.. హైదరాబాద్లోని ప్రగతి భవన్కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు మధ్యాహ్న భోజనం కలిసి చేశారు.. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు జరిగే భేటీలో ఇద్దరు ముఖ్యమంత్రులు వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చర్చకు రానున్నాయి. ఏపీలో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్తో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. సీఎం పదవి చేపట్టిన మూడు నెలల్లోనే మూడు సార్లు కేసీఆర్తో భేటీ అయ్యారు. విభజన సమస్యలను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకోవాలని కేంద్రంతో వ్యవహరించే తీరులో ఉమ్మడిగా కలిసి పని చేయాలని, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఇరు రాష్ట్రాల కలిసి చేపట్టాలని గతంలో నిర్ణయించారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరువురు సీఎంల భేటీలో ఏఏ అంశాలు చర్చిస్తారో అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఏపీ సీఎం జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు వచ్చారు.
