అమరావతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు క్రమంగా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని రైతుల ఆందోళనలకు మద్దతు పలుకుతున్నారు. అమరావతి రైతులతో త్వరలో విజయవాడలో భారీ కవాతు చేయాలని పవన్ సంసిద్ధం అవుతున్నారు. రాజధానిపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల రాజకీయంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఆర్‌కే రోజా బాబు, పవన్‌లపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు కావాలనే రాజధాని గ్రామాల ప్రజలను రెచ్చగొడుతున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఐదేళ్లలో రాజధాని ప్రజలకు నష్టం చేసింది చంద్రబాబేనని ఆమె అన్నారు. గతంలో రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ల్యాండ్‌పూలింగ్ సహకరించని రైతుల పంట భూములను తగులబెట్టి భయబ్రాంతులకు గురిచేశారని రోజా ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు రాయలసీమ ద్రోహి..అని రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయడం బాబుకు ఇష్టం లేదని..అందుకే అమరావతిలో రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అయినా రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? ఆయన కావాలనే ప్రజల్ని రెచ్చగొడుతున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఆందోళనల్లో మహిళలే ఎక్కువగా పాల్గొనడంపై రోజా స్పందిస్తూ…రాజకీయాల్లోకి మహిళల్ని లాగొద్దని సాక్షాత్తు జాతీయ మహిళా కమిషనే చంద్రబాబుకు చురకలు వేసిందని..అయినా బాబు తన స్వార్థ రాజకీయాల కోసం మహిళలను పావులుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇక గతంలో కర్నూలే రాజధానిగా కావాలని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు బాబు కోసం మాట మార్చారని రోజా అన్నారు. . రాజధానిపై బీజేపీ నేతల యూటర్న్ బాధాకరమని, స్వలాభం కోసం బీజేపీలో చేరిన సుజనా, సీఎం రమేష్‌కు మమ్మల్ని విమర్శించే అర్హత లేదని రోజా అన్నారు. . మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలంతా హర్షిస్తున్నారని, అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రోజా స్పష్టం చేశారు. మొత్తంగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కు ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు.