ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్రలు చేపట్టారు. అయితే రాజధానిపై వివాదం చెలరేగుతున్న దరిమిలా పోలీసులు ఎక్కడక్కడ 144 సెక్షన్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు భంగం కలుగకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి పోలీసులపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అవాంతారాలు ఎదురైనా బాబు పర్యటనలో పాల్గొంటానని తేల్చి చెప్పిన జేసిన… జేసీ శాంతియుత నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
అమరావతి దెబ్బకు వైసీపీ నేతలకు వణుకు మొదలైందని, సెక్యూరిటీ లేకుండా జనంలోకి వెళ్లే సాహసం చేయడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలకు నేను ఒకటే సవాలు విసురుతున్నా…మీకు నిజంగా మగతనం ఉంటే..పోలీసులు లేకుండా ప్రజల్లోకి రావాలి. అంతేగానీ కొజ్జాలను అడ్డం పెట్టుకుని అందరిని చావగొట్టడం ఎందుకంటూ పోలీసులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, లేకుంటే.. గ్రేటర్ రాయలసీమ డిమాండ్‌తో తిప్పికొడతామంటూ జేసీ రెచ్చిపోయారు.
కాగా పోలీసులను హిజ్రాలతో పోలుస్తూ నీచంగా మాట్లాడిన జేసీ వ్యాఖ‌్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. గతంలో పోలీసులతో బూట్లు నాకిస్తా అంటూ కించపర్చిన జేసీపై అనంతపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన జేసీ మరోసారి పోలీసులను హిజ్రాలతో పోల్చుతూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేసథ్యంలో మరోసారి జేసీపై కేసులు పెట్టేందుకు అనంతపురం పోలీసులు సిద్ధమవుతున్నారు.