మూడు రాజధానుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై బీజేపీ కోర్ కమిటీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతిలో రాజధాని ఏర్పాటు ఏ మాత్రం శ్రేయస్కరం కాదని.. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు బుట్ట దాఖలు చేసి ప్రజలను మోసం చేశారని బీజేపీ కోర్ కమిటీ మండిపడింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చర్చించకుండా చంద్రబాబు స్వలాభపేక్షతో రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కుట్రపూరితంగా రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం…చంద్రబాబు మోసపూరిత ఆలోచనలకు నిదర్శనమని బీజేపీ నేతలు అన్నారు. లక్ష కోట్లతో సింగపూర్ స్థాయి రాజధాని నిర్మాణం పూర్తి కాదని శివరామకృష్ణన్ కమిటీ తేల్చి చెప్పిందని, అయినా చంద్రబాబు మొండిగా అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడుతుందని చెప్పినా బాబు పట్టించుకోలేదంటూ బీజేసీ కోర్ కమిటీ మండిపడింది. మరోవైపు అమరావతిలో చంద్రబాబు పాట పాడుతున్న బీజేపీ నేత సుజనా చౌదరిపై కేంద్ర నేతలు సీరియస్ అయ్యారు. రాజధాని విషయంలో సుజనా తీరును వారు తప్పుబట్టారు. బీజేపీలో చేరినా సుజనాకు ఇంకా టీడీపీ వాసన పోలేదని , ఇప్పటికీ టీడీపీ ఎజెండాతోనే సుజనా పనిచేస్తున్నారని, రాజధానిపై సుజనా చేస్తున్న వ్యాఖ్యలు ఇంకా టీడీపీ వ్యాఖల్లాగే ఉన్నాయని పలువురు బీజేపీ కేంద్ర నేతలు మండిపడ్డారు. అయితే మూడు రాజధానులపై ఏపీ బీజేపీ నేతలు రెండు వర్గాలు చీలిపోయారు..కొందరు మూడు రాజధానులపై సమర్థించే వర్గంగా…అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతు పలుకగా..మరి కొందరు చంద్రబాబుకు అను”కుల” వర్గంగా అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మొత్తంగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో జరిగిన ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం హాట్‌హాట్‌గా సాగింది.
