అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధానిని కొనసాగించాలంటూ..మూడు వారాలుగా రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతుల్లో మరింతగా భయాందోళనలను రేకెత్తిస్తున్నారు. కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాజధాని రైతులకు మద్దతు పలుకుతున్నారు. ఈ మేరకు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా ఉంటామని పిలుపునిచ్చాడు. కాగా రాజధానిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ విభిన్న పద్దతులలో నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య పెద్ద ఎత్తున లోపులాట జరుగుతుంది. అక్కడక్కడా పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో పోలీసులు ఆందోళనలు చేస్తున్న మహిళలను అదుపులోకి తీసుకుని కొద్ది సేపటి తర్వాత విడుదల చేస్తున్నారు.
అయితే టీడీపీ సోషల్ మీడియా టీమ్ అమరావతిలో చేస్తున్న నిరసన కార్యక్రమాలకు మసిపూసి మారేడు కాయ చేస్తోంది. మార్ఫింగ్ ఫోటోలతో అమరావతిలో మగపోలీసులు మహిళలపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ..అసత్య ప్రచారం మొదలుపెట్టింది. మొన్న తమిళనాడులో భార్య చనిపోవడంతో తట్టుకోలేని ఓ వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని మరణిస్తే..దాన్ని అమరావతికి ఆపాదించి. రాజధాని కోసం రైతు ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది.
తాజాగా అప్పుడెప్పుడో పశ్చిమ బెంగాల్, నందిగ్రామ్‌లో చెలరేగిన ఘర్షణల్లో గాయపడిన ఓ మహిళ ఫోటోను మార్ఫింగ్ చేసి..అదిగో రాజధాని గ్రామాల్లో పోలీసులు ఓ మహిళను రక్తం వచ్చేలా దారుణంగా కొట్టారంటూ తెలుగుతమ్ముళ్లు సోషల్ మీడియాలో పోస్టులు చేసి దుష్ప్రచారం చేశారు. అయితే ఇదే ఫోటోను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు పంపించారు. దీంతో పవన్ రెచ్చిపోయారు. మీడియాకు తన మొబైల్‌లో ఆ ఫోటోను చూపిస్తూ..ఇవాళ రాయపూడిలో యుద్ధవాతావరణం అంటూ పవన్ విమర్శలు చేశారు.పాపం ఈ ఫోటోను తెలుగుతమ్ముళ్లు మార్ఫింగ్ చేసి పంపించారన్న విషయం పవన్‌కు తెలియదు. దీంతో పవన్ ఆ ఫోటోను మీడియాకు చూపిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీంతో నెట్‌జన్లు ఈ వ్యవహారంపై సెటైర్లు వేస్తున్నారు. పాపం సినిమా యాక్టర్‌ను తెలుగు తమ్ముళ్లు వెర్రోన్ని చేస్తున్నారు. ఎక్కడో వెస్ట్ బెంగాల్‌లో జరిగిన దానిని తుళ్లూరులో జరిగినట్లు తెలుగు తమ్ముళ్లు ఫేక్ ఫోటో పంపిస్తే..దానిని పట్టుకుని పవన్ మీడియాకు చూపెట్టి విమర్శలు చేస్తున్నారని..నెట్‌జన్లు కామెంట్లు చేస్తున్నారు..పవనూ మరీ ఇంత అమాయకుడివి అయితే ఎలా..కాస్త తెలుగు తమ్ముళ్లతో జాగ్రత్త అంటూ నెట్‌జన్లు పవన్‌కు హితవు పలుకుతున్నారు.