అమరావతి ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబు బిజీబిజీగా ఉంటున్నారు. విరాళాల సేకరణ దగ్గర నుంచి, రోడ్డుమీద బైఠాయింపులు, జోలె పట్టి భిక్షాటనలు..ఇలా వరుస కార్యక్రమాలతో బాబుగారు రాజధానిలో రచ్చ రచ్చ చేస్తుంటే…తెలుగు తమ్ముళ్లు మాత్రం వరుస షాక్‌లు ఇస్తున్నారు. అమరావతి ఆందోళనలు జరుగుతున్న రాజధాని జిల్లాలలోనే తెలుగు తమ్ముళ్లు వరుసగా వైసీపీలో చేరుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి నడిస్తే.. దేవినేని అవినాష్ బాటలో తెలుగు యువత అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి వైసీపీలో చేరారు.
తాజాగా గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మద్దాలిగిరి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు నియోజకవర్గ ఇంచార్జీగా వేరొక వ్యక్తిని నియమించారు.తనకు మాట మాత్రమైనా చెప్పకుండా..పార్టీ అధ్యక్షుడిని నియమించడంపట్ల మద్దాలి గిరి తీవ్ర అసంతృప్తి గురయ్యారు. ఈ మేరకు చంద్రబాబుకు ఏకంగా లేఖ రాసి తూర్పారబట్టారు. అయితే ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన మద్దాలి గిరి పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ‌్యంలో గుంటూరు జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు షురూ అయ్యాయి.
సత్తెనపల్లిలో టీడీపీకి చెందిన పలువురు ఆర్యవైశ్య సంఘం నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బచ్చు మనోహర్, పెరుమాళ్ళ శివన్నారాయణ, జెమిలి రాధా, దేవతి సుబ్బారావు సహా పలువురు నేతలు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ముప్పాళ్ళ, నకరికల్లు మండలాల నేతలు సైతం టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకర్రావు వీరికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఒకపక్క చంద్రబాబు రాజధాని రాజకీయంలో తలమునకలైవుంటే.. మరో పక్క టీడీపీ నేతలు మాత్రం వరుసగా పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరుతున్నారు. మొత్తంగా అమరావతితో పార్టీకి మైలేజీ వస్తుందకుంటే..ఇలా వరుసగా తెలుగుతమ్ముళ్లు వైసీపీలో చేరడం బాబుకు షాకింగ్‌గా మారింది.