శవరాజకీయాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. గతంలో ఇసుక కొరత నేపథ్యంలో సహజంగా మరణించిన మరణాలను భవన నిర్మాణ కార్మికులుగా చూపించి శవరాజకీయం చేయించిన ఘనత వీరిద్దరిది. తాజాగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో విధి నిర్వహణలో మరణించిన ఒక జర్నలిస్ట్ మరణాన్ని అడ్డంపెట్టకుని మరోసారి శవరాజకీయం చేద్దామని లోకేష్ ప్రయత్నించి భంగపాటుకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..ఒంగోలులో జనవరి 9 వ తేదీ టీవీ లైవ్ ప్రోగ్రాం కోసం వీడియో తీస్తున్న ఈటీవీ ఒంగోలు టౌన్ విలేకరి వీరగంధం సందీప్ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. అయితే అమరావతి కోసం టీడీపీ శ్రేణులు చేస్తున్న ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో తెలుగు తమ్ముళ్లు శవరాజకీయం చేద్దామని భావించారు. ఈ మేరకు ఆఘమేఘాల మీద నారా లోకేష్‌ను పిలిపించారు. లోకేష్‌తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు కూడా వచ్చారు. అనారోగ్య సమస్యలతో విలేకరి మరణిస్తే.. రాజధాని ఉద్యమంలో పోలీసుల అత్యుత్సాహం వల్ల జరిగిందని లోకేష్ ఆరోపిస్తూ..శవరాజకీయం చేశారు.
మృతుడు సందీప్ గ్రామం కొప్పోలుకు వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించిన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ..శాంతియుతంగా అమరావతి సాధన జేఏసీ ర్యాలీ నిర్వహిస్తుంటే..పోలీసులకు, జేఏసీ ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగిందని, దీంతో సందీప్ ఊపిరాకడ మరణించారని..ఆరోపించారు. అంతే కాకుండా ఈ విషయాన్ని లోకేష్ తన ఫేస్‌బుక్ పేజీలో కూడా పెట్టాడు. ఒంగోలు మండలం కొప్పోలులో జర్నలిస్టు సందీప్ భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించాను. పోలీసుల అత్యుత్సాహం వలన తోపులాట జరిగింది. విధినిర్వహణలో భాగంగా తమ్ముడు సందీప్ మృతి చెందడం బాధాకరం. సందీప్ కుటుంబసభ్యులకు అండగా ఉంటా అని హామీ ఇచ్చాను అంటూ లోకేష్ పోస్ట్ చేశాడు.
కాగా అదే ర్యాలీ కవర్ చేస్తున్న ఇతర మీడియా జర్నలిస్టులు మాత్రం అక్కడ ఎలాంటి తోపులాట, తొక్కిసలాట జరగలేదని స్పష్టం చేశారు. సందీప్ ఉదయం నుంచి పలు కార్యక్రమాలను కవర్ చేస్తూనే ఉన్నాడని, అయితే సాయంత్రం అమరావతి సాధన సమితి చేపట్టిన ర్యాలీని వీడియో తీస్తూ..అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడని…వెంటనే తాము ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్థారించినట్లు రిపోర్టర్లు చెబుతున్నారు. మొత్తంగా విధి నిర్వహణలో అకస్మాత్తుగా మరణించిన జర్నలిస్ట్ మరణాన్ని కూడా అమరావతి ఆందోళనలలో పోలీసుల అత్యుత్సాహం వల్ల చనిపోయాడని చెప్పడం లోకేష్‌కు చెల్లింది. అయితే సహజంగా జరిగిన మరణాన్ని ఇలా లోకేష్ రాజధాని వివాదంలోకి లాగడం పట్ల ఓంగోలు ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు.శవరాజకీయాలు చేయడంలో తండ్రి చంద్రబాబును లోకేష్ మించిపోయాడని ఒంగోలు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.